సీఎం జగన్ ఏడుగురు ఎమ్మెల్యేలకు షాకిచ్చారు. వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లేదని తేల్చేశారు. వారు చేసిన తప్పేమిటంటే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనకపోవడం. వర్క్ షాప్లో సీఎం జగన్ ఈ విషయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ జాబితాలో ఇద్దరు మాజీ మంత్రులు కూడా ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాపరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వసంతకృష్ణ ప్రసాద్, ఆళ్ల నాని, శిల్పా చక్రపాణి రెడ్డిలు గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని ఈ సారి వారికి టిక్కెట్ లేనట్లేనని జగన్ స్పష్టం చేశారు.
దీంతో వారు షాక్కు గురయ్యారు. ఎందుకు పాల్గొనలేకపోతున్నామో వివరించే ప్రయత్నంచేశారు. కానీ జగన్ వినిపిచుకోలేదని అంటున్నారు. మొత్తంగా ఇప్పటి వరకూ ఏడుగురు ఎమ్మెల్యేలకు జగన్ ఇలా ఈ సారి పార్టీ కోసం పని చేయాలని.. పోటీకి ప్రయత్నించవద్దని ముందుగానే చెప్పినట్లయింది. ఇలా చెప్పడానికి కారణాలు ఉన్నాయని.. గ్రాఫ్ పడిపోతున్న ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేసినట్లుగా ఉంటుందని చెబుతున్నారు.
అయితే ఇందులో జగన్కు బాగా దగ్గర అయిన అనిల్ కుమార్ యాదవ్ , ఆళ్ల నాని వంటి నేతలకు టిక్కెట్ ఇవ్వకకుండా పక్కన పెడతారా అన్న చర్చ నడుస్తోంది. చివరికి అయినా వారికే టిక్కెట్ ఇస్తారని అంటున్నారు. ఎమ్మెల్యేలను హెచ్చరించడానికే ఇలాంటి కామెంట్లు చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. నిజానికి జగన్ ప్రకటనను ఆ పార్టీ నేతలు సీరియస్గా తీసుకోలేదు.