మాజీ హోంమంత్రి సుచరిత భర్త కూడా మాజీ అయ్యారు. అయితే ఆయన వైసీపీలో లేరు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. ఆదాయపు పన్నుశాఖ అధికారిగా ఉన్నత స్థానంలో ఉన్న మేకతోటి దయాసాగర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని జబుల్పూర్లో విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ పని చేయడం ఇష్టం లేక రాజీనామా సమర్పించేశారు. వీఆర్ఎస్ కి అప్లయ్ చేయడంతో వెంటనే కేంద్రం అంగీకరించింది.
దయాసాగర్ కొన్నాళ్ల క్రితం విజయవాడలో పోస్టింగ్ తెచ్చుకున్నారు. భార్య హోంమంత్రిగా ఉండగా… భర్త ఆదాయపు పన్ను శాఖ అధికారిగా ఉన్నారని ఇక టీడీపీ నేతలకు సినిమా చూపిస్తారని అనుకున్నారు. అయితే వరుసగా కంప్లైంట్లు వెళ్లడం.. ఆయనపై అనేక ఆరోపణలు ఉండటంతో కేంద్రం స్పందించింది. పోస్టింగ్ ఎలా వచ్చిందో ఆరా తీసి వెంటనే… మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు బదిలీ చేసింది. అసలు ఇలా బదిలీ చేయడానికి కారణం వైసీపీ ప్రభుత్వంలో ఓ కీలక సలహాదారు అన్న ప్రచారం కూడా జరిగింది. దీనిపై అప్పట్లో సుచరిత రగిలిపోయారు.
తర్వాత మంత్రి పదవి నుంచి కూడా తీసేయడంతో అసంతృప్తి బయటపడింది. కానీ ఏం చేయాలో తెలియక మిన్నకుండి పోయారు. ఇప్పుడు జబల్పూర్ జాబ్ కూడా వదిలేసిన దయాసాగర్ .. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారేమో చూడాలి. వైసీపీలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకుంటారో.. లేకపోతే అవమానం జరిగిందని ఇతర పార్టీల్లో చేరుతారో వేచి చూడాలి !