సంచలనం ఖాయమన్నారు కానీ కేసీఆర్ గడువు ముంచుకొస్తున్నా సైలెంట్‌గా ఉండిపోతున్నారు. అన్నా హజారేతో మాట్లాడి రాష్ట్రపతి అభ్యర్థిగా ఫైనల్ చేస్తారనుకుంటే.. మళ్లీ ఫామ్ హౌస్కెళ్లిపోయారు. బయటకు రావడం లేదు. మరో వైపు ఏ క్షణమైనా రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ రావొచ్చంటున్నారు. అయితే కేసీఆర్ అంతర్గతంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారేమో కానీ ఇప్పటికైతే ఎలాండి డెలవప్మెంట్ బయటకు కనిపించడం లేదు. కనీసం కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటకు రావడం లేదు.
మరో వైపు హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో సమావేశం కావడం అనేక రకాల చర్చలకు కారణం అయింది. అసలు సమయం.. సందర్భం లేకుండా వెళ్లి కేంద్రమంత్రిని కలవడం ఏమిటన్న వాదన వినిపిస్తోంది. రాజీవ్ చంద్రశేఖర్ కేవలం కేంద్రమంత్రి మాత్రమే కాదు.. ఆయన బీజేపీ రాజకీయ వ్యూహాల్లో కీలకంగా ఉంటారన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన రకరకాల చర్చలకు కారణం అవుతోంది.
ఎంత ప్రయత్నించినా పరిస్థితి ఆశాజనకంగా మారకపోవడంతో వీలైనంత సైలెంట్‌గా ఉండటమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వకపోయినా ఎన్నికకు దూరంగా ఉంటే చాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటి వరకూ తీవ్ర విమర్శలు చేసి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తే ఇబ్బందికరమే. అలాగని అభ్యర్థిని నిలబెట్టేలని పరిస్థితి.. విపక్షాలు .. కాంగ్రెస్ లాంటి పార్టీ నిలబెడితే మద్దతివ్వడం కూడా కష్టమని.. కేసీఆర్ కు ఇష్టమైన వ్యూహం మౌనంగా ఉండటం .. దాన్ని పాటిస్తే చాలని నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
కేసీఆర్ చెప్పే సంచలనం ఇప్పుడల్లా నమోదయ్యే అవకాశం లేదని.. తాజా పరిణామాలతో తేలిపోతుంది. మరి ఆ సంచలనం కోసం ఎన్నికల వరకూ ఆగాలేమో చూడాలి !