వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న గాంగాధర్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యవహారం కలకలం రేపుతోంది. పులివెందులకు చెందిన గంగాధర్ రెడ్డి కొంత కాలంగా అనంతపురం జిల్లా యాడికిలో నివాసం ఉంటున్నారు. ఆయన ప్రస్తుతం వివేకా హత్య కేసులోజైల్లో ఉన్న శివశంకర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఇటీవల తనను సీబీఐ అధికారులు వేధిస్తున్నారని.. లంచం ఇవ్వజూపారని అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
గత నవంబర్ 29న వైఎస్ అవినాష్ రెడ్డిని ఇరికించేలా సాక్ష్యం చెబితే సీబీఐ అధికారులు రూ. పది కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారంటూ కల్లూరు గంగాధర్ రెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేకాను తానే చంపానని ఒప్పుకోవాలని కూడా ఒత్తిడి చేశారని అంటున్నారు. ఓ సమగ్రమైన లేఖను తీసుకుని ఆయన ఎస్పీని కలిశారు. తర్వాత ఓ వర్గం మీడియాకు ఇంటర్యూలు ఇచ్చారు. వివేకా హత్య కేసుతో తనకు సంబంధం లేదని.. గంగాధర్ రెడ్డి చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని.. తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. అప్పుడే ఆయనకు భద్రత ఇచ్చి.. పోలీసులు పంపించారు. అప్పటి నుండి పోలీసుల రక్షణలోనే ున్నారు.
గంగాధర్ రెడ్డి పలు తీవ్రమైన కేసుల్లో నిందితుడు. ఆయన శివశంకర్ రెడ్డి చెప్పిన పనల్లా చేసేవారని చెబుతూంటారు. పులివెందులలో పుట్టి పెరిన గంగాధర్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకుని యాడికికి మకాం మార్చారు. అయినప్పటికీ శంకర్ రెడ్డి చెప్పే పనులు చేసేవారు. ప్రాణభయం ఉందని వ్యక్తం చేసిన గంగాధర్ రెడ్డి అనుమానాస్పదంగా చనిపోవడం ఆసక్తి రేపుతోంది. గతంలో పరిటాల రవి కేసులోనూ అనుమానితులు.. సాక్షులు ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. గతంలోనూ ఓ సాక్షి ఇలా అనుమానాస్పదంగా చనిపోయారు.