ఏపీ రాజకీయ పార్టీలన్నీ జనం బాట పట్టాయి. రెండేళ్ల ముందు నుంచే ఓటర్లను కాకా పట్టాలని నిర్ణయించుకున్నాయి. వైసీపీ ఇప్పటికే రంగంలోకి దిగింది. టీడీపీ ప్రారంభిస్తోంది. పవన్ కూడా అదే చేస్తున్నారు. జగన్ ఎన్నికలకు వెళ్తారని గట్టి నమ్మకంతో ఉన్న అన్ని పార్టీలు.. ముందుగానే అభ్యర్థులను కూడాఖరారు చేసుకుంటున్నాయి.
గడప గడపకూ వెళ్తున్న వైసీపీ !
వైఎస్ జగన్ తమ పార్టీని ఎన్నికలుక సమాయత్తం చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలంతా ఎనిమిది నెలల పాటు గడప గడపకూ వెళ్లనున్నారు. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం ఉంది కాబట్టే.. ఆ గడువు పెట్టారని భావిస్తున్నారు. కారణం ఏదైనా చేస్తోంది ఎన్నికల ప్రచారమే. ప్రతి ఇంటికి ఇంత మొత్తం ఇచ్చాం కాబట్టి ఓటు వేయాలని గడప గడపకూ వెళ్తున్న వాళ్లు అడుగుతున్నారు. సీఎం జగన్ జిల్లాల పర్యటనలు అని చాలా సార్ల చెప్పారు కానీ ఆయన వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లుగా లేదు. అయితే వెళ్లకుండా ఉండరని ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసుకుని రంగంలోకి దిగుతారని అంటున్నారు.
యాత్రలతో ప్రజల్లోకి టీడీపీ !
ఎన్నికలయ్యే వరకూ యాత్రలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇక పూర్తిగా ప్రజల్లో నే ఉండాలని నిర్ణయించుకుంది. చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా జిల్లాల పర్యటనలకు వెళ్లనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ నెల 15వ తేదీ నుంచి తన పర్యటనను ప్రారంభించనున్నారు. అక్టోబరు లో లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇద్దరూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన లను ఏడాదిలోపు పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నారు.
పవన్ యాత్ర ఉంటుందన్న నాగబాబు !
పవన్ కల్యాణ్ పాదయాత్ర ఉండదు కానీ దానితో సమానమైన యాత్ర ఉంటుందని నాగబాబు ప్రకటించారు. దానికి తగ్గట్లుగా అక్టోబర్ నుంచి యాత్ర ప్రారంభించాలని పవన్ నిర్ణయించారు.
గతంలో పవన్ కల్యాణ్ బస్సుయాత్రల్లాంటివి చేశారు.ఈ సారి కూడా బస్సు యాత్రే చేస్తున్నారు. వచ్చే మార్చిలో ఎన్నికలు వస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నందున.. అక్టోబర్‌తో ప్రారంభించి ఎన్నికలయ్యే వరకూ ప్రజల్లోనే ఉండే అవకాశం ఉంది.