శుక్రవారం దేశవ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనలు భవిష్యత్ భయాన్ని కలిగించక మానవు. తమ ప్రవక్తపై అనుచితవ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేయాలని ఓ వర్గం తీవ్రంగా ఆందోళనలు చేసింది. అవి దారి తప్పాయి. హింసకు కారణం అయింది. ఈ పరిస్థితి ఎప్పటికి చల్లారుతుందో తెలియదు కానీ.. రావణకాష్టం చేయడానికి మాత్రం రాజకీయం కాచుకుని కూర్చుకుంది. ఏపీలోనూ అలాంటి చిచ్చే పెట్టడానికి రంగం సిద్ధమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కోనసీమ జిల్లా పేరును మార్చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో నీతికవాతు నిర్వహిస్తామని కొన్ని సంస్థలు ప్రకటించాయి. దీనికి ప్రభుత్వ మద్దతు ఉందన్న ప్రచారం జరుగుతోంది. సీఐడీ డీజీ హోదాలో ఉన్న సునీల్ కుమార్ నడుపుతున్న క్రైస్తవ మిషనరీ దీని వెనుక ఉందని రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నారు. నీలి కవాతు పేరుతో రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలకు ప్రణాళికసిద్ధం చేశారని ఆయన నేరుగా హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న కొన్ని ఘటనలు.. వాటికి సంబంధించి పర్యవసానాలను ఆయన వివరించారు.
ఈ క్రమంలో నీతి కవాతుపై ఏపీలో చర్చ ప్రారంభమయింది. కోనసీమ అల్లర్లు పూర్తి స్థాయిలో వైసీపీ నేతలు చేసిన కుట్రని తేలిపోయింది. మంత్రి, ఎమ్మెల్యేకు కనీస ఓదార్పు దక్కలేదు. ఇప్పుడు దాన్ని సాకుగా చూపించి చిచ్చు పెట్టాలని వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని… అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో నీలి కవాతు అంశం .. హైలెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కోనసీమ ఇప్పుడిప్పుడే చల్లబడుతోంది. కానీ మళ్లీ చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతూండటమే చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.