చంద్రబాబు హయాంలో అమరావతి బాండ్లను వేలం వేసి రూ. రెండు వేలకోట్లు అప్పు తీసుకు వచ్చారు. ఇప్పుడు సీఎం జగన్ లిక్కర్ బాండ్లను వేలం వేసిరూ. ఎనిమిది వేల కోట్ల అప్పు తీసుకున్నారు. తొమ్మిదిన్నరశాతం వడ్డీకి ఈ లిక్కర్ బాండ్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయినట్లుగా మార్గెట్ వర్గాలు చెబుతున్నాయి. పెద్దగా ప్రచారం లేకుండా .. మూడో కంటికి తెలియకుండా లిక్కర్ బాండ్లు వేలం వేసినా దాదాపుగా రూ. ఎనిమిదివేల కోట్లు అప్పుగా రావడం మార్కెట్ వర్గాలను కూడా ఆశ్చర్య పరుస్తోంది. ఎవరు ఈ బాండ్లు కొన్నారు అనేది గుట్టుగానే ఉంది.
మరోవైపు ఈ లిక్కర్ బాండ్లు అమ్మకానికిపెట్టే ముందు అప్పు ఇచ్చే వారికి రాతపూర్వకంగా అనేక హామీలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి లిక్కర్ పాలసీని మార్చబోమన్న హామీ. అంటే..ప్రస్తుతం ఉన్నధరలు.. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాలు… అలాగే కొనసాగుతాయి. అదే సమయంలో ఎలాంటి మద్య నిషేధం విధించే ఆలోచనకూడా చేయబోమని హమీ ఇచ్చారు. పూర్తిగా కానీ… కొద్దిగా కానీ మద్య నిషేధం అనే పాలసీనే తీసుకురాబోమని చెప్పారు. నిజానికి జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం… వచ్చే ఎన్నికల నాటికి స్టార్ హోటళ్లకు మాత్రమే లిక్కర్‌ను పరిమితం చేసి ఓటు అడగడానికి వెళ్లాలి. కానీ అదేమీలేదని లిక్కర్ బాండ్ల అమ్మడానికి ఇచ్చిన హామీలతో తేలిపోయింది.
గత ఏడాది ఏపీ మద్యం ఆదాయం తొమ్మిది వేల కోట్లు ఉంటే..ఈ ఏడాది పద్దెనిమిది వేల కోట్లు ఉంటుందని ప్రభుత్వం లెక్కలేసింది. ఈ కారణంగానే లిక్కర్ బాండ్లకు భారీగా డిమాండ్ ఏర్పడిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ బాండ్లకు వడ్డీలకు చెల్లింపు్లకు ప్రత్యేక ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేయనున్నారు. లిక్కర్ ఆదాయం నేరుగా ఆ ఖాతాకు చేరనుంది. మొత్తంగా ప్రభుత్వం ఎన్ని మార్గాల ద్వారా దొరికినా అన్ని మార్గాల ద్వారా అప్పులు చేస్తున్నారు. అందులో తాజాగా లిక్కర్ బాండ్లు చేరాయి.