జాతీయ రాజకీయల విషయంలో కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకుంటున్నారు. కొత్త పార్టీ కాకుండా టీఆర్ఎస్ పేరునే భారత రాష్ట్రీయ సమితిగా మార్చాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఓ పార్టీ.. దేశంలో మరో పార్టీ ఉంటే బాగుండదని.. రెండు పార్టీలకూ ఒకే సారి అధ్యక్షుడిగా ఉండటం కుదరదన్న ఉద్దేశంతో కేసీఆర్ .. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మార్పు విషయాన్ని నెలాఖరులో అధికారికంగా ఢిల్లీలో ప్రకటించే అవకాశం ఉంది.
అయితే కేసీఆర్ రిస్క్ చేస్తున్నారన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఎక్కువగా వినిపిస్తోంది. తెలంగాణను వదిలిపెట్టేస్తున్నారన్న భావన ప్రజల్లోకి వస్తుందని ఆ పార్టీ నేతలు కంగారు పడుతున్నారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన నేత. తెలంగాణ కోసమే జీవితం అంకితం చేసిన నేత. పార్టీ పేరులోనూ తెలంగాణ ఉంది. అంటే.. తెలంగాణనే టీఆర్ఎస్కు ఆత్మ. అలాంటిది.. తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మారిస్తే.. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆందోళనలో ఎక్కువ మంది ఉన్నారు. ఇదే విషయాన్ని హైకమాండ్‌కు చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ ఎప్పుడూ లేని విధంగా రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆయన ఇతర పార్టీల నేతలతో కలిసి నడిచే ఉద్దేశలో లేరని.. తానే జాతీయ రాజకీయాల్ని లీడ్ చేయాలనుకుంటున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ దాని వల్ల తెలంగాణలో ఎలాటి పరిణామాలు ఉంటాయన్నదానిపై కేసీఆర్ సరైన అంచనాకు రాలేకపోతున్నారన్న అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తోంది.