ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రజాకర్షక పథకాలు ప్రకటిస్తూంటారు. సహజమే. కానీ ఇప్పుడు ఏపీలో భిన్నమైన పరిస్థితి ఉంది. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. దాదాపుగా రాష్ట్రాన్నే తాకట్టు పెట్టేశారు. దివాలాకు దగ్గరగా ఉన్నామని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ కూడా అదే చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ జనసేన పార్టీ ఇస్తున్న హామీలు సోషల్ మీడియాలో రకరకాల చర్చలకు కారణం అవుతున్నాయి. సీపీఎస్ రద్దు చేస్తామని.. ఒక్కో ఇంటికి రూ. పది లక్షలు ఇస్తామని నాదెండ్ల మనోహర్ ప్రకటించడంతో .. జనసేన చెబుతున్నదేంటి..? చేస్తున్నదేంటి అనే చర్చ ప్రారంభమయింది.
ఏపీలో వచ్చే ఇరవై ఏళ్ల ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారు. ఇరవై ఏళ్ల పాటు ఆ అప్పులు కట్టుకుంటూ ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి రూ. పది లక్షలు హామీ అనేది నమ్మశక్యమేనా..? అనేది జనసేన పార్టీ నేతలు ఆలోచించుకోలేకపోతున్నారు. తెలంగాణలో దళిత బంధు పథకం పెట్టారు. కానీ ఎంత మందికి ఇవ్వగలుగుతున్నారో ప్రభుత్వం కూడా చెప్పలేకపోతోంది. బడ్జెట్ అయితే కేటాయించారు కానీ.. పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతోంది. మరి అంత కంటే విస్తృతంగా ఇంటికో రూ.పది లక్షలు ఎలా పంచుతారో జనసేన చెప్పాల్సి ఉంది.
అలాగే సీపీఎస్ రద్దు చేస్తామని కూడా హామీ ఇస్తున్నారు. ఎలా రద్దు చేస్తారో చెప్పడం లేదు. మీకు చేతకాలేదు..మేము చేసి చూపిస్తామంటున్నారు. రాజస్థాన్లో చేయలేదా అని ఎదురుదాడికి దిగుతున్నారు. సీపీఎస్ రద్దు అనేది చాలా ఖర్చుతో కూడుతున్న పని అని రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందులో నిజం లేదు. ఓ పది.. లేదా ఇరవై వేల కోట్లతో అయిపోయేది అయితే.. ఎక్కడో చోట అప్పు తెచ్చి జగన్ ఆ పనీ పూర్తి చేసేవారు. ఎలా అమలు చేస్తారో చెప్పకుండా… ఇలాంటి హామీలు ఇవ్వడం వల్ల జనసేనను జనం నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుదంని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.