తెలంగాణ సెంటిమెంట్‌తో తెలంగాణ ప్రజలందర్నీ ఏకం చేసిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ విషయంలో దక్షిణాది సెంటిమెంట్ తీసుకోబోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ అంశంపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిలించడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. అసలు తెలంగాణ ఉద్యమాన్నే అందరూ మర్చిపోయిన తర్వాత ఆయన రగిలించి.. రాష్ట్రాన్ని తీసుకు వచ్చారు. తన జాతీయ రాజకీయం కూడా తెలంగాణ ఉద్యమ తరహాలో ఉంటుందని కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. ఆ మాటలకు ఇప్పుడు క్లారిటీ లభిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
దక్షిణాదికి కేంద్రం అన్యాయం చేస్తోందనే వాదన
కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందన్నది గణాంకాలతో సహా ఉన్న విషయం. దేశంలో దక్షిణాది పురోగామి రాష్ట్రం. పన్నుల వసూళ్లు ఎక్కువగా ఈ వైపు నుంచి వెళ్తూంటాయి. కానీ దేశం మొత్తానికి ఆ పన్నుల ఆదాయం పంచే క్రమంలో ఎక్కువగా ఉత్తరాదికే నిధులు వెళ్తూంటాయి. దీని వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతోందనే భావన ఉంది. అదే సమయంలో దేశ పరిపాలనా బాధ్యతలలో దక్షిణాదికి అసలు ప్రాధాన్యతే ఉండటం లేదు. ప్రధాని పదవి ఎప్పుడూ ఉత్తరాది వారికే ఉంటోంది. రాష్ట్రపతి పదవుల్లాంటి వాటిలోనూ చాన్స్ రావడం లేదు. ఈ కారణంగా అసంతృప్తి కనిపిస్తోంది. పైగా ఇటీవలి కాలంలో లోక్‌సభ సీట్లు కూడా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
తెలంగాణ తరహాలోనే దక్షిణాది సెంటిమెంట్ పై వర్కవుట్
ఈ పరిణామాలన్నింటితో దక్షిణాదిలో దక్షిణాది సెంటిమెంట్‌ను ప్రధానంగా ప్రచారం చేసి రాజకీయం చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. మొత్తం దక్షిణాదిలో బలంగా ఉన్న జాతీయ పార్టీ లేదు. కర్ణాటకలో బీజేపీ ఉంటే.. రెండు, మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ దక్షిణాది మొత్తం ప్రభావం చూపేలా తన విధానాన్ని ఖరారు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
గతంలో స్పందించకపోవడం మైనస్ అవుతుందా ?
అయితే కేసీఆర్ గతంలో దక్షిణాదికి అన్యాయం జరిగిందని .. దక్షిణాది రాష్ట్రాలు కలిసి పెట్టుకున్న సమావేశాలకు హాజరు కాలేదు. కేంద్రాన్ని ప్రశ్నిద్దామని స్టాలిన్ లాంటి వాళ్లు రాసిన లేఖలకు స్పందించలేదు. అప్పుడు కనీసం మద్దతు ఇవ్వకుండా ఇప్పుడు దక్షిణాది కోసం పోరాటం అంటే ఎవరు నమ్ముతారనేది ప్రధానమైన ప్రశ్నగా మారింది. దీన్ని కేసీఆర్ అధిగమించాల్సి ఉంది.