ఆర్థిక సంక్షోభంతో నిట్ట నిలువునా మునిగిపోయిన శ్రీలంకలో ఇప్పుడు అదానీ మరో వివాదానికి కారణం అవుతోంది. శ్రీలంకలోని మన్నార్‌లో నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంటు కాంట్రాక్టును ఎలాంటి పోటీ లేకుండా అదానీ గ్రూప్‌నకు అప్పగించాలని ఆ దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సపై భారత ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంకకు చెందిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ ఈ విషయాన్ని ప్రకటించారు. స్వయంగా ప్రధాని మోదీనే.. అదానీ కోసం ఒత్తిడి తెచ్చారని చెప్పడంతో శ్రీలంకలో మరోసారి రాజకీయం రాజుకుంది.
శ్రీలంకలో సంప్రదాయేతర ఇంధన వనరుల మౌలిక వసతుల ప్రాజెక్టులపై కుదిరిన ఒప్పందాలపై ఆ దేశ పార్లమెంటులోని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కమిటీ విచారణ చేస్తోంది. ఈ కమిటీ ముందు సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ హాజరయ్యారు. మన్నార్ విండ్ పవర్ ప్లాంటును ఎలాంటి పోటీ లేకుండా అదానీ గ్రూప్‌నకు ఇవ్వాలని భారత ప్రధాని తనపై ఒత్తిడి తెస్తున్నారని గోటబయ తనకు చెప్పారని ఆయన వాంగ్మూలం ఇచ్చారు. ఇది టీవీల్లో ప్రసారం అయింది.
అసలే గోటబయపై రగిలిపోతున్న జనం.. ఈ విషయం తెలియడంతో మరోసారి రెచ్చిపోయారు. దేశవ్యాప్తంగా నిరసనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో గోటబయ మన్నార్ విండ్ పవర్ ప్లాంటును ఏ వ్యక్తికిగానీ, ఏ సంస్థకుగానీ ఇవ్వాలని నేను సిఫారసు చేయలేదని.. సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నారని ప్రకటించారు . అయితే సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణ కాంట్రాక్టులను ఎలాంటి పోటీ లేకుండా ఎంపికచేసిన సంస్థలకు అప్పగించేలా చట్టంగా మార్చేశారు. ఇదంతా కుట్రపూరితంగానే జరుగుతోందని శ్రీలంకలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి.