రాష్ట్రపతి ఎన్నిక అంశాన్ని కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారు. మొదటగా తానే లీడ్ తీసుకుని అన్నా హజారేను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టి సంచలనం సృష్టిద్దామనకున్నారు. పలు రాష్ట్రాలకు వెళ్లి చర్చలు జరిపి వచ్చారు.కానీ ఎక్కడా ఆయనకు సానుకూల ఫలితం కనిపించ లేదు. దీంతో పూర్తిగా అసలు రాష్ట్రపతి ఎన్నికల గురించే ఆలోచించడం మానేసినట్లుగా తెలుస్తోంది. మమతా బెనర్జీ ప్రత్యేకంగా లేఖ రాసినా… ఫోన్ చేసి మాట్లాడినా విపక్షాల మీటింగ్‌కు వెళ్లేందుకు ఆయన ఆసక్తి చూపించడం లేదు.
బుధవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో విపక్షాల సమావేశం జరగనుంది. దీనికి కేసీఆర్ హాజరు కావడంలేదు. ఆయన ఢిల్లీ పర్యటన ఇవాళ, రేపు లేదని ప్రగతి భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో కేసీఆర్ వెళ్లడంలేదని తేలిపోయింది. అదే సమయంలో టీఆర్ఎస్ తరపున కూడా ఎవరూ హాజరయ్యే అవకాశం లేదంటున్నారు. విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబడితే కేసీఆర్ మద్దతిస్తారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. నాలుగైదు రోజుల్లో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు.
అయితే కేసీఆర్ ఎజెండా రాష్ట్రపతి ఎన్నికలు కాదు.. భారత రాష్ట్ర సమితి ప్రకటన. ఈ హడావుడిలోనే ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు ఐక్యత లేకపోవడం వల్ల గెలుపు అనేది సాధ్యం కాదని పరువు పోగొట్టుకోవడం ఎందుకని కేసీఆర్ సైలెంట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.