కోనసీమ అల్లర్లు సృష్టించారని జగన్ అనంతపురంలో ఆరోపణలు చేశారు కానీ.. అల్లర్లు చేసి అరెస్టయిన వారంతా వైసీపీ కార్యకర్తలే. దాదాపుగా రెండు వందల మందికిపైగా ఈ అల్లర్లలో నిందితులుగా చేర్చితే వారిలో అత్యధికులు బాధితులుగా ఉన్న మంత్రి పునిపే విశ్వరూప్ అనుచరులే. తాజాగా కోనసీమ సాధన సమితి నేతలపైనా కేసులు పెట్టారు. వీరు కూడా విశ్వరూప్ ముఖ్య అనుచరులే. కోనసీమ అల్లర్లు పూర్తిగా వైసీపీ కోసం.. వైసీపీ చేత.. వైసీపీ కుట్ర అన్నట్లుగా సాగాయని ఇప్పటి వరకూ తేలిన విషయాలతో వెల్లడయింది.
అయినప్పటికీ సీఎం జగన్.. చిచ్చు పెట్టాలనుకుంటున్నారని ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. దళిత మంత్రి ఇంటిని తగలబెట్టేశారని ప్రజల ముందు సానుభూతి కోసం జగన్ వ్యాఖ్యలు చేశారు కానీ.. ఇంత వరకూ ఆ మంత్రిని పరామర్శించలేదు. ఆయన ఇంటివైపు కూడాచూడలేదు. డీజీపీ కూడా ఇరవై రోజుల తర్వాత అమలాపురం వెళ్లి అల్లర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించారు.
చూస్తూంటే.. ఈ అంశాన్ని రాజకీయంగా విపక్షాలపై ఆరోపణలు చేయడానికి వాడుకోవడానికే ఉపయోగించుకునేలా ఉన్నారు కానీ.. ఇందులో భాగమైన వారు తమ పార్టీ వారే అని అంగీకరించే పరిస్థితుల్లో లేరు. తెలుసు కాబట్టి వీలైనంత లో ప్రోఫైల్ పాటించి.. అవసరం అయినప్పుడు విపక్షాలపై విమర్శలుగా వాడుకుంటున్నారు.