ఏపీ అసెంబ్లీలో పెగాసస్‌ను చంద్రబాబు వాడారని దానిపై విచారణ చేయాలని సభాసంఘం వేస్తే.. ఇప్పుడు అది ఒక అంశం మాత్రేమనని…ఏపీలో అప్పట్లో జరిగిన అనేక అంశాలపై విచారణ చేస్తామని ఆ సభా కమిటీ ఛైర్మన్ రెడ్డిగారు ప్రకటించారు. మార్చిలో సభా సంఘం వేస్తే ఇప్పటి వరకూ ఆ సంఘం సమావేశం కావాలా.. వద్దా అన్నదాన్ని సలహాదారులు పట్టించుకోకపోవడంతో ఒక్క సమావేశం కాలేదు. మళ్లీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఈ హౌస్ కమిటీ గురించి గుర్తుకు వచ్చిందేమో కానీ రెండు రోజుల పాటు గంట పాటు వరుసగా సమావేశాలు నిర్వహించి కొన్ని మీడియా లీకులు ఇచ్చారు.
పెగాసస్‌పై అసలు మమతా బెనర్జీ మాట్లాడిందో లేదో తెలుసుకోవాలని.. ఒక వేళ మాట్లాడకపోతే గాలి కబుర్ల మీద కమిటీ వేసినట్లుగా అవుతుందన్న ఉద్దేశంతో.. బెంగాల్ వెళ్లి అసెంబ్లీ రికార్డులు పరిశీలించాలని మొదటి రోజు అనుకున్నారు. వెళతారో లేదో స్పష్టత లేదు.రెండో రోజు సమావేశం హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని తీర్పులిచ్చేశారు. అప్పట్లో ప్రయివేటు వ్యక్తుల ఫోన్లు టాప్ చేసింది. ఇది శాసన సభ నమ్మింది, కమిటీ కూడా నమ్మింది. ఈ రోజు ప్రాథమిక విచారణ మాత్రమే జరిగింది. వచ్చే సమావేశంలో పూర్తి సమాచారం ఇస్తామని ప్రకటించారు. విచారణకు అప్పటి అధికారులను కూడా పిలుస్తామన్నారు.
డేటా చోరీ అంటూ అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేలా మాట్లాడుతూండటంతో… గత ఎన్నికలకు ముందు తెరపైకి తెచ్చిన అంశాన్ని మరోసారి పైకి తెచ్చి అప్పట్లాగే ఫేక్ ప్రచారాలతో హోరెత్తించే ప్లాన్ ఏదో అమలు చేయబోతున్నారన్న అనుమానాలు టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి భూమన కరురణాకర్ రెడ్డి అసలు పెగాసస్ ఓ అంశం మాత్రమేనని తేలిగ్గా తీసుకుని ఇతర అంశాలపై విచారణ చేయడానికి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అయితే సభా కమిటీకి ఇచ్చిన బాధ్యతలు కాకుండా ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవచ్చా లేదా అన్నది నిపుణులు తేల్చాల్సి ఉంది.