రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అన్నది బీజేపీ ఇంత వరకూ తేల్చుకోలేదు. నిజానికి మోదీ, షా ఎప్పుడో తేల్చుకుని ఉంటారు. వారు ఓ అభ్యర్థిని ఫిక్స్ చేసుకుని ఉంటారు. కానీ టైం చూసి బయట పెడతారు. ఆ అభ్యర్థి ఎవరన్నదానిపై క్లారిటీ రాలేదు. కానీ దక్షిణాదిలో మాత్రం ఓ రకమైన సెంటిమెంట్ పెరుగుతోంది. దేశ రాజకీయ పాలనా వ్యవస్థలో దక్షిణాది ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోతోందని కీలకమైన పదవులు కాదు కదా… కేంద్ర కేబినెట్ పదవులు కూడా దక్కడం లేదన్న అసంతృప్తి ప్రజల్లో పెరుగుతోంది. కొద్ది రోజులుగా ఈ అంశంపై మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి.
దేశంలో దక్షిణాదిలో ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థ ఉంది. అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. జాతీయ పార్టీలు అక్కడక్కడ మాత్రమే బలంగా ఉన్నాయి. ఈ కారణంగా అధికారం ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే ఉంటుంది. అయితే ఉత్తరాదిలో మాత్రం జాతీయ పార్టీలు ప్రభావం చూపిస్తున్నాయి. అక్కడి గెలుపుతోనే దేశ పగ్గాలు చేపడుతున్నారు. అదే కారణంతో అక్కడి వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దక్షిణాదిని పట్టించుకోవడం మానేస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ ప్రాధాన్యాల్లో దక్షిణాది పేరు కూడా వినిపించడం తగ్గిపోయింది.
రాష్ట్రపతి అభ్యర్థికి గత మూడు పర్యాయాలుగా దక్షిణాది నుంచి ఎంపిక కాలేదు. ప్రధాని పదవి ఎలాగూ దక్కే పరిస్థితి లేదు. అందుకే.. రాష్ట్రపతి లాంటి కీలక పదవి అయినా దక్షిణాదికి ప్రాతినిధ్యం ఉండాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. లేకపోతే అసమానతలు పెరిగిపోతాయని ఇది అంతిమంగా దేశానికి నష్టం చేస్తున్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో మోదీ, షాలు ఏం ఆలోచిస్తున్నారో కానీ దక్షిణాది సెంటిమెంట్ మాత్రం పెరుగుతోంది. దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.