దేశంలో ఐదారువేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఒకే ఒక పార్టీ బీజేపీ. అంతే కాదు ఇటీవల ప్రత్యేకంగా విరాళాల డ్రైవ్ నిర్వహించింది. బీజేపీకి చందా ఇవ్వడం అంటే దేశభక్తి అన్నట్లుగా చెప్పింది. అయితే.. తెలంగాణ బీజేపీకి మాత్రం ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. జాతీయ కార్యవర్గ సమావేశాలు.. ఆ తర్వాత బహిరంగసభ నిర్వహణ భుజాన వేసుకున్న బీజేపీ నేతలు ఖర్చుల కోసం వెదుక్కుంటున్నారు. ఖర్చుల కోసం కార్యకర్తల నుంచి నిధుల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు.
రూ.1000 మొదలుకొని రూ. లక్ష వరకు విరాళాల సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. హోదాల వారీగా ఎవరెవరు ఎంతెంత ఇవ్వాలో కూడా లిస్ట్ రెడీ చేశారు. రాష్ట్రస్థాయి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చట్టసభల మాజీ ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జిల నుంచి రూ. లక్ష, జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా పదాధికారుల నుంచి రూ.20 వేలు, బూత్ అధ్యక్షుల నుంచి రూ.1000 నుంచి రూ.5 వేల వరకు వసూలు చేయాలనుకుంటున్నారు. ఈనెల 25వ తేదీలోపు నిధుల సేకరణను పూర్తిచేయాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నది.
మొత్తం డిజిటల్ రూపంలోనే విరాళాలు తీసుకుంటారు కాబట్టి లెక్కలు ఉంటాయని చెబుతున్నారు. అది సరే కానీ.. ఇలా ప్రతీ కార్యక్రమానికి కార్యకర్తలు, నేతల నుండి వసూలు చేయడమేమిటని… వారికి అప్పటికే జన సమీకరణ బాధ్యతలు పెడతారని. . .అధికారంలోకి రాక ముందే ఇలా నేతల్ని పిండేయడం ఏమిటన్న చర్చ ఆ పార్టీలోనే నడుస్తోంది. కానీ ఎవరూ కిక్కుమనే పరిస్థితి లేదు.