తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరిపడిన సినిమావాళ్లు ఇప్పుడు కిక్కురుమనడం లేదు. చిన్నా చితకా ఆర్టిస్టులు కూడా నేరుగా వైసీపీ కండువా వేసుకుని ఆ పార్టీ కోసం ఊరూవాడా తిరిగారు. మోహన్ బాబు అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో వీధి నాటకం కూడా వేశారు. ఇక అలీ లాంటి వారి సంగతిచెప్పాల్సిన పని లేదు. కృష్ణుడు, భానుచందర్ లాంటి వారు వేసిన వేషాలకూ కొదవ లేదు. పోసాని లాంటి వాళ్లు పూర్తిగా హద్దులు దాటేశారు. రేపు ఏపీలో తాము కొమ్ముకాసిన పార్టీ అధికారం కోల్పోతే ఆజ్ఞాతంలోకి పోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే వీరెవరికైనా వైసీపీ నుంచి చిన్న సాయం అందిందా అంటే… మరో మాట లేకుండా .. లేదు అనే సమాధానం వస్తోంది.
వక్ఫ్ బోర్డు చైర్మన్, రాజ్యసభ అంటూ ఊరించి అలీని పక్కన పెట్టేశారు. ఇప్పుడు అసెంబ్లీ టిక్కెట్ అంటున్నారు. కానీ ఆయనకు ఏ చాన్స్ లేదని వైసీపీ వర్గాలు ఇప్పటికే చెబుతున్నాయి. ఆయనకు టిక్కెట్ ఇచ్చే పని అయితే ఇప్పటికే నియోజకవర్గంలో పని చేసుకోమనేవారని చెబుతున్నారు. ఇక మోహన్ బాబు కు టీటీడీ చైర్మన్ నుంచి చాలా ఆశలు పుట్టాయి.ఒక్కటీ నెరవేరలేదు. ఫృధ్వీ తనకు సినిమా అవకాశాలు పోయాయని చెప్పి ఓ పదవి పొందినా.. వైసీపీ అంతర్గత రాజకీయాలతో దాన్నీ పోగొట్టుకున్నారు. ఇప్పు అటు రాజకీయ…ఇటు సినిమాల్లో నిరుద్యోగిగా మారారు. జనసేనలో చేరుతానంటున్నారు. కానీ జనసేన గడప దగ్గరకు కూడా రానిచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు.
ఇక చిన్నా చితకా ఆర్టిస్టులకు వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసి ఏ ప్రయోజనం పొందకపోగా.. వారు చేసిన ఓవరాక్షన్ వల్ల ఉపాధికి కూడా గండి పడే పరిస్థితి ఏర్పడింది. వృత్తిని వృత్తిగా చూడకుండా రాజకీయం కలిపేసుకున్నారు. వారంతా రోడ్డున పడ్డారు. సీఎం జగన్ నుకలిసేందుకు కూడా వారికి ఎవరికీ అవకాశం దక్కడం లేదు. వైసీపీకి అవసరమైనప్పుడు మాత్రం పిలిచి ఉపయోగించుకుని వదిలేస్తున్నారు. సినిమా వాళ్లకు ఇప్పటికి అయినా అసలు విషయం గుర్తు వచ్చి ఉంటుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. గుర్తించకపోయినా పోయేదేమీ లేదని.. ఈ సారి జనంలోకి వస్తే పరిస్థితి వేరుగా ఉంటుందన్న విశ్లేషణలు కూడా సినీ వర్గాల నుంచే వస్తున్నాయి.