ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారులు ప్రజలను ఓ మాదిరి ఆలోచన పరులుగా కనిపించడం లేదు. తాము ఏదంటే అది నమ్ముతారని గట్టిగా అనుకుంటున్నారు. మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి చేయకుండా బార్ల సంఖ్యను కూడా తగ్గించుకుండా కొత్త పాలసీపై వస్తున్న విమర్శలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఆ సమాధానం ఏమిటంటే.. మద్యం వినియోగం తగ్గించేందుకు బార్ల సంఖ్యను పెంచలేదట. అంటే.. తగ్గించలేదని కూడా అర్థం. బార్ల సంఖ్య అంతే ఉంచితే మద్యం తాగేవారు ఎలా తగ్గుతారు ? ఈ మాత్రం ఆలోచన ఈ వివరణ ఇచ్చే వారికీ ఉండదా ? ఉన్నా.. ప్రజలు తాము ఏమి చెబితే అది నమ్మేస్తారన్న నమ్మకంలో ఉన్నారు. ప్రజలు మరీ అంత అమాయకులు అయిపోయారని అనుకుంటున్నారా ?
టీడీపీ హయాంలో 840 బార్లు ఉన్నాయి. తాము రాగానే తాగేవాళ్లని తగ్గించేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం బార్ లైసెన్సులన్నీ రద్దు చేసింది. కొత్త అప్లికేషన్లు తీసుకుంది. నలభై శాతం బార్లను తగ్గించింది. కానీ ఐదేళ్లకు లైసెన్సులు ఇచ్చి ఇప్పుడు క్యాన్సిల్ చేయడంపై వారు కోర్టుకెళ్లారు. అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. ఇప్పుడు బార్ లైసెన్స్‌ల సమయం పూర్తయింది. అడగకపోయినా రెండు నెలల సమయం పెంచింది. కొత్త బార్ పాలసీలో గతంలో నలభై శాతం తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని రివర్స్ చేసుకుంది. అన్ని బార్లను కొనసాగిస్తోంది.
ఇదేమిటని ప్రజలు .. విపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు.. పాత సమాధానం చెప్పింది. మద్యం వినియోగాన్ని తగ్గించేందుకట. జిల్లాలు పెరిగినా బార్లను పెంచలేదట. ఇటీవల జిల్లాలు పెంచగానే కరెంట్ సమస్యలు వచ్చాయి. పదమూడుజిల్లాల కరెంట్ ఇరవై ఆరు జిల్లాలకు సరిపోవాలి కదా అని కొంత మంది సెటైర్లు వేశారు. జనం అంతే అమాయకంగా ఉంటారని.. జిల్లాలు పెంచినా బార్లను పెంచలేదని కవరింగ్ చేసుకుంటున్నారు. ప్రజలు అసలు ఏ మాత్రం ఆలోచనా పరులు కాదన్న గట్టి నమ్మకం ఉంటేనే ఇలాంటి సమాధానం చెప్పగలరన్న అభిప్రాయం వస్తే అది మన తప్పేం కాదు.