ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నియమకం చేసింది. ఏపీ హైకోర్టులో రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా యర్రంరెడ్డి నాగిరెడ్డిని నియమిస్తూ న్యాయశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నాగిరెడ్డి రాష్ట్రప్రభుత్వం తరఫున హైకోర్టులో ప్రాసిక్యూషన్లు, అప్పీళ్ల విచారణ తదితర కేసులకు హాజరవుతారు. మూడేళ్ల పాటు ఈ పోస్టులో కొనసాగుతారు. అంతకుముందు పీపీగా వ్యవహరించిన కె.శ్రీనివాస రెడ్డి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడంతో ఇంతకాలం ఈ పోస్టు ఖాళీగా ఉంది. శ్రీనివాసరెడ్డి స్థానంలో నాగిరెడ్డిని నియమించారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ కన్నా అడ్వకేట్ జనరల్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. పోలీసులు నమోదు చేసే క్రిమినల్ కేసుల్లో వారి తరపున వాదించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించిన కేసుల్లో వాదించడానికి అడ్వకేట్ జనరల్ ఉంటారు. అందు వల్ల ఎక్కువగా అడ్వకేట్ జనరల్ ఫోకస్ అవుతారు. పబ్లిక్ ప్రాసిక్యూర్ వ్యవస్థ జిల్లా కోర్టుల్లోనూ ఉంటుంది. ప్రభుత్వం వారిని నియమిస్తుంది. అయితే ఇటీవల వారి నియామకాల్లో సామాజిక న్యాయం కొరవడిందన్న విమర్శలు ఎక్కువగా వచ్చాయి.
ప్రభుత్వం వరుసగా కీలక పదవుల్లో నియమిస్తున్న వారి విషయంలో తరచూ వివాదం తలెత్తుతోంది. అంతా ఒక వర్గానికే ఇస్తున్నారని ఇతర వర్గాల్లో ప్రతిభావంతులు లేరా అన్న వాదన వస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం తమ ప్రభుత్వం చేసినట్లుగా సామాజిక న్యాయం ఏ ప్రభుత్వం చేయలేదని వాదిస్తూ వస్తోంది.