2019లో తాను సీఎం అయి ఉంటే ఏపీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా రైతు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన తర్వాత జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. సరి పనిచేయకపోతే సీఎం చొక్కా పట్టుకునే విధంగా యువకులను తయారు చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించారు. రూ.5లక్షల కోట్లు అప్పు తెచ్చారు… రైతులకు రూ.2వేల కోట్లు ఇచ్చామని చెబుతున్నారు… మొత్తం లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని మానసికంగా హింసించి.. కక్ష సాధించేందుకే అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఎవరినైనా ఏమైనా అనొచ్చు, దాడి చేయొచ్చు కానీ.. ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారిని మానసికంగా వేధిస్తున్నారు. వైసీపీ అరాచకాలపై ప్రశ్నిస్తే దత్తపుత్రుడని అంటున్నారు. అన్యాయంపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు.
పొత్తుల గురించి తాను ఇప్పుడే మాట్లాడబోనని.. తనకు ప్రజలతోనే పొత్తులు ఉంటాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గతంలో ప్రజల కోసమే మోదీ, టీడీపీతో విభేదించాలన్నారు. ప్రజలతో ఎలా ముందుకు వెళ్లాలన్నదే తన ఆలోచన అని స్పష్టం చేశారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఏపీకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. ప్రజలు అవకాశం ఇస్తే వెంటనే జాబ్ క్యాలండర్ ప్రకటిస్ామని.. జనసేనకు 2.5లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఉందని అన్నారు. . పార్టీ పెట్టినప్పటి నుంచి మాకు ప్రతికూల పరిస్థితులే. అయినా, ఎక్కడా వెనక్కి తగ్గలేదని .. ప్రజల కోసం అనుకున్నది చేస్తాన్నారు.
దసరా తర్వాత నుంచి తాము రోడ్డెక్కుతామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. దసరా నుంచి పవన్ బస్ యాత్ర ప్రారంభిస్తున్నారు. అప్పట్నుంచి వైసీపీ పాలనపై రోడ్డెక్కి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పవన్ సభకు భారీగా జనం తరలి వచ్చారు.