ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈటలతో పాటు ఆయన కూడా బీజేపీలో చేరారు. ఈటల రాజేందర్ హుజురూబాద్ నుంచి గెలిచిన తర్వాత ఒక్క సారిగా హైప్ వచ్చింది. ఆ తర్వాత ఆయనను వ్యూహాత్మకంగా రాష్ట్ర నాయకత్వం పక్కన పెట్టేసింది. ఫలితంగా ఈటల ఎక్కడా కనిపించడం లేదు. ఎప్పుడైనా సభలు.. సమావేశాలు జరిగినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు. అక్కడా ఆయనకు పెద్దగా ప్రయారిటీ లభించడం లేదు.
ఇటీవల బండి సంజయ్‌తో ఆయనకు పొసగడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా బీజేపీకి గుడ్ బై చెప్పి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలతో కలిసి కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. నిజానికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీజేపీ బలోపేతానికి ఆయనను రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకుంటారని అనుకున్నారు. కానీ అలాంటి పనులేమీ చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో పార్టీ హైకమాండ్‌కు తన వేదన వినిపించుకోవడానికి కొంత కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయన్న వాదన వినిపిస్తోంది.
ఈటల రాజేందర్ ను పార్టీలో చేర్చుకునేటప్పుడు చాలా హామీ ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అయితే పార్టీలో ప్రాధాన్యం ఇస్తామని అమిత్ షా ఈటలకు హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. వారం, రెండు వారాల్లో ఈటలకు బీజేపీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని ఆయన వర్గీయులు అంచనా వేస్తున్నారు.