ఏపీలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం నేరుగా పిష్ ఆంధ్రా పేరుతో మార్టులు పెడుతూంటే పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. దీంతో ఇటీవలి కాలంలో మార్కెట్లలో చేపలమ్ముకునేవాళ్లపై అధికారులు గురి పెట్టారు. వరుసగా దాడులు చేస్తున్నారు. ఆదివారం పూట ఫిష్ మార్టులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కనీసం 150 మందిపై కేసులు పెట్టారు. ఎందుకంటే తూకం సరిగ్గా వేయడం లేదట. చేపల తూకం పక్కగా ఉంటుందని వినియోగదారులు కూడా అనుకోరు. చాలా చోట్ల ఫిష్ ఆకారాన్ని బట్టి రేటు పెట్టుకుంటారు కానీ తూకం వేసుకోరు. ఫిష్ మార్కెట్లో బేరసారాలు భిన్నంగా ఉంటాయి. అయినా తూకం సరిగ్గా లేదని చేపలమ్ముకునేవాళ్లపై కేసులు పెట్టేశారు.
ఫిష్ మార్టులు పెట్టి తమ ఉపాధి దెబ్బతీస్తున్నారని చాలా మంది మత్స్యకారులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రకరకాల స్కీములతో యువతకు ఉపాధి కల్పిస్తున్నామంటూ ఫిష్ మార్టులను ప్రారంభించింది. అయితే ఎక్కడా అవి క్లిక్ అవలేదు. చివరికి ముఖ్యంగా ఘనంగా ప్రకటించిన పులివెందుల ఫిష్ మార్ట్ కి కూడా కరెంట్ బిల్లులు కూడా రాక మూసేశారు. తర్వాత మీడియాలో వచ్చినా హడావుడిగా తెరిచారు కానీ అక్కడ ఏమీ అమ్మలేదు. మళ్లీ మూతపడిపోయింది. అనేక మందికి పంపిణీ చేసిన ఫిష్ మార్ట్ వాహనాలదీ అదే పరిస్థితి.
ఈ స్కీమ్ దారుణంగా విఫలం కావడంతో చేపల మార్కెట్లలో కార్యకలాపాలు తగ్గిస్తే జనం ఫిష్ మార్టుల వైపు చూస్తారన్న ఆలోచన చేశారేమో కానీ.. ఒక్క సారిగా చేపల మార్కెట్లపై విరుచుకుపడ్డారు. వ్యాపారం అధికంగా జరిగే ఆదివారం రోజున వ్యాపారులను తనిఖీల పేరుతో భయ భ్రాంతులకు గురి చేశారు. ఐదు వందల చేపల దుకాణాల్లో తనిఖీలు చేసి170 మందిపై కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం తీరుపై మత్స్యకారులు ఆేదన చెందుతున్నారు. తమ పొట్ట కొట్టవద్దని అంటున్నారు.