కరోనా మొదటి విడత లాక్ డౌన్ పెట్టిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల జీతాల్లో కోత వేసినట్లుగా ప్రకటించింది. అలా నెలాఖరు సమయం. జీతాల బిల్లులు కూడా రెడీ అయ్యాయి. అయినా ఆపేశారు. అదే స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వం కూడా సగం జీతాలే ఉద్యోగులకు ఇచ్చింది. అలా రెండు నెలల పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల పాటు చేసింది. ఇలా కట్ చేసిన మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం తర్వాత వాయిదాల పద్దతిలో ఇచ్చేసింది. కానీ ఏపీ ప్రభుత్వం ఇంత వరకూ ఇవ్వలేదట. ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు ఇదే విషయం చెప్పుకుని బాధపడుతున్నారు. బకాయిలు ఇప్పించాలని కోరుతున్నారు.
రెండు నెలల పాటు సగం సగం జీతాలే అప్పట్లో ఉద్యోగులకు అందాయి. కత్తిరించిన జీతాలు మళ్లీ ఎప్పుడిస్తారో చెప్పపలేదు. అప్పట్లో కొంత మంది ఉద్యోగులు కోర్టుకెళ్లారు. వడ్డీతో సహా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం వెళ్లింది. గడువులోపు ఇస్తే వడ్డీ అక్కర్లేదని ఆదేశించింది. కానీ ఈ తీర్పు విషయంలోనూ ప్రభుత్వం అడ్వాంటేజ్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇంత వరకూ జీతాలు బకాయిలివ్వలేదని తెలుస్తోంది. అందరికీ ఇవ్వలేదా.. కొంత మందికా అన్నదానిపై స్పష్టత లేదు.
రెండు నెలల పాటు సగం సగం జీతం ఇవ్వడం అంటే.. ఒక నెల జీతం అందలేదన్నమాట. ఎలా లేదన్నా.. అది నాలుగైదు వేల కోట్ల వరకూ ఉండవచ్చని చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగుల సొమ్ము పెండింగ్లో ఉన్నా ఉద్యోగ సంఘ నేతలు ఎందుకు ఇప్పటి వరకూ నోరు మెదపలేదనేది అర్థం కాని విషయం. పీఆర్సీ చర్చల సమయంలో బకాయిలన్నీ రెండు నెలల్లో క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ అలాంటి బకాయిలేమీ చెల్లింపులు జరగలేదు. అడగడానికి ఉద్యోగ సంఘ నేతలకూ పెద్దగా నోళ్లు రావడం లేదు.