పెట్టుబడి – మార్కెటింగ్ విషయాల్లో సురేష్ బాబు బుర్రే బుర్ర. ఏ సినిమా ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఆడుతుంది? అనే విషయాల్లో సురేష్ బాబుకి చాలా స్పష్టత ఉంటుంది. తన కొడుకు సినిమా అయినా సరే, సెంటిమెంట్ లకు లొంగడు. ఎంత ఖర్చు పెట్టాలో అంతే పెడతాడు. రూపాయి నష్టం వస్తుందనుకొన్నా, ఆ ప్రాజెక్ట్‌ని వదులుకోవడంలో ఏమాత్రం ఆలస్యం చేయడు. విరాటపర్వం విడుదల ఆలస్యమవ్వడానికి కారణం… సురేష్ బాబు ఆలోచనా సరళే. ఈ సినిమా ఎప్పుడో పూర్తయ్యింది. కానీ.. విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. దానికి కారణం సురేష్ బాబు. ఈ సినిమాని నేరుగా ఓటీటీలోనే విడుదల చేయాలన్నది సురేష్ బాబు ఆలోచన. ”ఈ తరహా సినిమాలు చూసినవాళ్లంతా మెచ్చుకుంటారు. కానీ చూడ్డానికే జనం థియేటర్లకు రారు. అలాంటప్పుడు థియేటర్లలో విడుదల చేయడం వల్ల నష్టం తప్పితే, లాభం ఉండదు..” అని ముందు నుంచీ సురేష్ బాబు చెబుతూనే ఉన్నాడు. తనే నెట్ ఫ్లిక్స్ నుంచి ఓ మంచి ఆఫర్ తీసుకొచ్చాడు. దాదాపు 40 కోట్లకు సినిమా బేరం పెట్టాడు. కానీ… రానా మాత్రం ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేద్దాం.. అని పట్టుబట్టి కూర్చున్నాడట.
ఈ సినిమాకి సురేష్ బాబు సింగిల్ ప్రొడ్యూసర్ కాదు. మరో నిర్మాత కూడా ఉన్నాడు. తనదీ.. ఇదే మాట. ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేద్దామనే సరికి, సురేష్ బాబు మాట చెల్లుబాటు కాలేదు. కాకపోతే… విడుదలకు ముందు రోజు వరకూ ‘ఇది పక్కా ఓటీటీ సినిమా’ అంటూనే ఉన్నాడట. ఇప్పుడు తన మాటే నిజమైంది. టాక్ బాగుంది కానీ, అది వసూళ్లలో కనిపించడం లేదు. థియేటర్ లో విడుదలై… ఆ తరవాత ఓటీటీకి వెళ్తోంది కాబట్టి.. ఇప్పుడు ఓటీటీకి రేటు సగానికి సగం పడిపోయింది. అదే… నేరుగా ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేసి ఉంటే, విరాటపర్వం ఈపాటికి లాభాల్లో ఉండేది. ఈ విషయంలో సురేష్ బాబు అంచనానే నిజమైంది.