జాతీయ క్రీడ హాకీ కాదు… క్రికెట్ అనేంత స్థాయిలో ఎదిగింది క్రికెట్. క్రికెటర్ల ఆదాయం, వాళ్ల క్రేజ్… ఊహించలేనంత. ఓ మ్యాచ్లో క్లిక్ అయితే చాలు. జీవితం స్థిరపడిపోయినట్టే. కాస్త పేరు తెచ్చుకుంటే, తరతరాలకు సరిపడినంత సంపాదించేయొచ్చు. అయితే… ఇక్కడ కూడా వివక్ష ఉంది. పురుష క్రికెట్ కి ఉన్నంత ఆదరణ… మహిళా క్రికెట్ కి లేదు. అసలు నిన్నా మొన్నటి వరకూ జాతీయ మహిళా జట్టులో సభ్యులెవరో చెప్పలేని పరిస్థితి. బీసీసీఐకి వేల కోట్ల ఆదాయం ఉన్నా.. వాళ్ల దృష్టి పురుషుల క్రికెట్ పైనే. మహిళల్లోనూ అంతర్జాతీయ స్థాయి ప్రొఫెషనల్ క్రీడాకారులున్నారని, వాళ్ల ప్రతిభకు మెరుగులు పెట్టొచ్చన్న విషయాన్ని బీసీసీఐ ఎప్పుడో విస్మరించింది. వీటన్నింటినీ కళ్లకు కడుతూ ఓ సినిమా వస్తోంది. అదే `శభాష్ మిథూ`. మహిళా క్రికెటర్లలో ఆణిముత్యం లాంటి క్రీడాకారిణి.. మిథాలీ రాజ్ జీవిత కథ ఇది. ఆ పాత్రలో తాప్సి కనిపించబోతోంది. వచ్చే నెల 15న ఈ చిత్రం ప్రేక్షకల ముందుకు రాబోతోంది. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది.
మాట వరుసకు ఇది మిథాలీ కథే అని చెప్పొచ్చు. కానీ… మహిళా క్రికెటర్లపై ఉన్న వివక్షతకు ట్రైలర్ అద్దం పట్టింది. ఓ దశలో మహిళా జట్టుని బీసీసీఐ దూరం పెట్టింది. వాళ్లను డీ గ్రేడ్ ఆటగాళ్లుగా చూసింది. కనీసం జెర్సీలు కూడా ఇవ్వలేదు. అడిగితే…. పురుషుల జెర్సీలు పంపి, వాటినే వాడుకోమని చెప్పింది. ఇవన్నీ… శభాష్ మిథులో కళ్లకు కట్టాడు దర్శకుడు. బాలీవుడ్ లో స్పోర్ట్స్ డ్రామాలకు కొదవ లేదు. కాకపోతే… ఎమోషనల్ డ్రైవ్ ఉన్న కథలకు అక్కడ పట్టం కడుతుంటారు. మిథాలీ కథ చూస్తుంటే, ఆ ఎమోషనల్ డ్రామా ఈ కథలో బాగా పండినట్టు అనిపిస్తోంది. తాప్సి కథల ఎంపికపై.. బాలీవుడ్ ప్రేక్షకుల్లో గురి ఎక్కువ. మహిళా క్రికెట్ కు పేరు తీసుకొచ్చిన మిథాలీ రాజ్ గురించి కూడా వాళ్లకు తెలుసు. కాబట్టి.. ఈ సినిమాపై ఫోకస్ పడేలానే ఉంది.