జూలై ఒకటో తేదీ నుంచి ఆన్ లైన్ టిక్కెట్లు అమ్ముతామని ఏ టిక్కెట్ అయినా ప్రభుత్వం అమ్ముతుందని తర్వాత డబ్బులిస్తామని ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం జీవో ఇచ్చి ఇప్పుడు ధియేటర్ల యజమానులు తమతో ఎంవోయూ చేసుకోవాల్సిందేనని పట్టుబడుతోంది. ఎంవోయూ చేసుకుంటేనే ఆన్ లైన్ పరిధిలోకి వస్తుంది లేకపోతే రాదు. అందుకే.. ఎంవోయూ చేసుకోకపోతే ధియేటర్లను సీజ్ చేస్తామని ప్రభుత్వ అధికారులు బెదిరిస్తున్నారు. అంతే కాదు శాంపిల్‌గా ఒక్కో ఊళ్లో నాలుగైదు సీజ్ చేస్తున్నారు. దీంతో కొంత మంది సంతకాలు పెడుతున్నారు. కానీ చాలా మంది సైలెంట్‌గా ఉంటున్నారు.
ధియేటర్ యజమానులు ఒక్కరిదే నిర్ణయం ఉండదు. వారు కొంత మందితో వ్యాపార ఒప్పందాలు చేసుకుని ఉంటారు. అలాంటి వారు అంగీకరించడం లేదు. ఏం చేయాలో తెలియక తంటాలు పడుతున్నారు. మరో వైపు ఈ సమస్యను అధిగమించడానికి ఫిల్మ్ చాంబర్ కూడా అధికారికంగా ప్రభుత్వానికి లేక రాసింది. తాము ఆన్ లైన్ టిక్కెట్లు అమ్ముతామని కమిషన్ ఎప్పటికప్పుడు ఇస్తామని చెబుతోంది. కానీ దానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు.
కలెక్షన్ డబ్బులు పేటీఎం, బుక్ మై షో లు ఒక్క రోజులో ఇస్తామని ప్రభుత్వం కూడా ఇలా ఒక్క రోజులోనే ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ విషయం ఎంవోయూలో స్పష్టంగా లేదని అంటున్నారు. ఓ సారి ప్రభుత్వం చేతికి డబ్బులు వెళ్తే మళ్లీ వస్తాయో రాదోనన్న ఆందోళనలో ఎగ్జిబిటర్లు,… ఫిల్మ్ ఇండస్ట్రీ వారు ఉన్నారు. అందుకే వీలైనంత వరకూ సంతకాలు చేయకుండా ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. ఇంకా రిస్క్ తీసుకోవడం ఎందుకు ధియేటర్లు మూసుకుంటే మంచిదన్న భావనలో ఉన్నారు. లేనిపోని నిబంధనలు పెడుతున్న ప్రభుత్వం రెండు శాతం కమిషన్ తీసుకోవడమే కాదు… భవిష్యత్‌లో మరిన్ని పన్నులు బాదుతుందని.. అలాగే జరిమానాల పేరుతో వచ్చిన కలెక్షన్ ఉంచేసుకున్నా అడిగే దిక్కు ఉండదన్న ఆందోళనలో ఉన్నారు. పరిస్థితి చూస్తూంటే సగం ధియేటర్లు ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధంగా లేనట్లుగా ఉందన్న వాదన వినిపిస్తోంది. మళ్లీ కోర్టుకెళ్లే ఆలోచన చేస్తున్నారు.