ఏపీ ప్రభుత్వం తాము తప్పుడు లెక్కలను ఇస్తున్నామని తామే సాక్ష్యాలు ఇస్తోంది. ప్రజాధనం ఎలా ఖర్చు పెడుతున్నామో.. ఎక్కడ అప్పులు చేస్తున్నామో.. ఎలా చేస్తున్నామో చెప్పేందుకు అనేక రకాల తప్పుడు లెక్కలు చెబుతోంది. ఆ విషయాన్ని రాష్ట్రమే సాక్ష్యాలుగా ఇస్తోంది. కానీ కాగ్.. కేంద్రం మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. ఏపీ ప్రభుత్వం కాగ్, కేంద్రానికి ఇస్తున్న లెక్కలు వైరల్ అవుతున్నాయి. అసలు ఇదేమి లెక్కలన్న చర్చ నడుస్తోంంది.
ఫిబ్రవరి వరకు రాష్ట్రం సబ్సిడీల కోసం రూ.17,234 కోట్లు ఖర్చు చేసినట్లు ముందుగా కాగ్‌కు ఇచ్చింది. తర్వాత మార్చి వచ్చేసరికి ఈ మొత్తం రూ.14,681 కోట్లకు తగ్గిపోయింది. అంటే ఖర్చు పెట్టేసిన తర్వాత తగ్గిపోయిందన్నమాట. అదెలా సాధ్యం ? అనే డౌట్ ఎవరికైనా వస్తుంది. కానీ కేంద్రానికి రావడం లేదు. అంటే… ఎప్పటికప్పుడు తప్పుడు లెక్కలు రాస్తున్నారన్నమాట. ఫిబ్రవరి నెలలో కేవలం రూ.417 కోట్లు మాత్రమే రెవెన్యూ వ్యయ పద్దులో చూపించారు. జీతాలు, పెన్షన్లు మొత్తం రెవిన్యూ వ్యయం అవుతాయి. అంటే.. ఆ కొద్ది మొత్తమే జీతాలుగా ఇచ్చారా ? మిగతా మొత్తం ఇవ్వలేదా ? ఇచ్చినా లెక్కల్లో ఎందుకు చూపించడం లేదు ?
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంతవరకు ఏపీ ఎలాంటి వివరాలను సమర్పించలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు వివరాలు ప్రకటించాయి. కానీ రాష్ట్రం మాత్రం ఇవ్వలేదు. మార్చి 31 నాటికి తీసుకున్న రుణాలు, గత రుణాలకు చేసిన చెల్లింపులు, వడ్డీల వివరాలు, ఇంకా ఎంత అప్పు ఉందన్నది కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది. కానీ కాగ్ ఇచ్చిన వివరాలను యథాతరంగా చెబుతోంది. కానీ ఆడిటింగ్ చేయడం లేదు. కేంద్రం పట్టించుకోవడం లేదు. తప్పుడు లెక్కలని స్పష్టంగా తెలుస్తున్నా.. ఎలాంటి జాగ్రత్తలు కేంద్రం తీసుకోవడం లేదు. ఆ ప్రివిలేజ్ ఏపీకే దక్కింది.