తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోయింది. కేసీఆర్ వ్యూహాత్మకంగా కోవర్టుల్ని ప్రయోగించి.. పార్టీ నేతల్ని చేర్చుకుని ఆ పార్టీ లేదు అనే భావన తీసుకొచ్చారు. అప్పట్లో తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప మరో పార్టీకి చోటులేదన్న భావన ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. చివరికి షర్మిల కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తున్నారు. ఇతర పార్టీలు బలంగా పుంజుకుంటున్నాయన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో టీడీపీ కూడా తమకు సంస్థాగత బలం ఉన్న ప్రాంతాల్లో కార్యక్రమాలను యాక్టివ్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబునాయుడు ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నారు. 24వ తేదీన ఆయన ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు హాజరు కానున్నారు. ఈ విగ్రహాన్ని ఐదేళ్ల కిందటే ఏర్పాటు చేశారు. కానీ ఇంత వరకూ ఆవిష్కరించలేదు. కొత్తగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి చంద్రబాబు అంగీకరించడంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంలో చంద్రబాబు పర్యటనకు స్పందన వస్తే.. టీడీపీ కూడా ఆ జిల్లాలో రేసులో ఉన్నట్లుగా భావించవచ్చు.
ఖమ్మం జిల్లాలో టీడీపీ మొదటి నుంచి బలంగా ఉంది. గత రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించినప్పటికీ ఆ జిల్లాలో కేవలం ఒక్క సీటుకే పరిమితం అయింది. ఆ తర్వాత అందర్నీ పార్టీలో చేర్చుకుంటున్నారు కానీ ఓట్ల ద్వారా టీఆర్ఎస్ అక్కడ గెలవలేకపోతోంది. అక్కడ కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి మంచి అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. బలమైన నేతలు ఎవరూ లేనప్పటికీ ఎన్నికల సమయానికి వస్తారని .. తెలంగాణలో టీడీపీ దృష్టి పెట్టే కొన్ని నియోజకవర్గాల్లో ఖమ్మం జిల్లాలోనివి కూడా ఎక్కువే ఉంటాయని భావిస్తున్నారు.