కరోనా దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే టాలీవుడ్ కోలుకుంటున్న దశలో మరో గట్టి షాక్ తగిలింది. రేపటి నుంచి షూటింగులకు రామంటూ… సినీ కార్మికులు బంద్‌కి పిలుపునిచ్చారు. గత కొంత కాలంగా తమ వేతనాలు పెంచాలని సినీ కార్మికులు ఫెడరేషన్‌పై గట్టిగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ విషయంలో ఫెడరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో కార్మికులంతా ఇప్పుడు సమ్మెకు పిలుపునిచ్చారు. తమ వేతనాలు పెంచేవరకూ షూటింగుల్లో పాల్గొనమని ఫెడరేషన్‌కి లేఖ అందించారు. అంతేకాదు… రేపు అంటే బుధవారం ఫెడరేషన్ ని ముట్టడించాలని కార్మికులు నిర్ణయించారు.
కార్మికుల సమ్మె.. టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఈ విషయమై నిర్మాతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కార్మికుల వేతనాలు పెంచడం ఫెడరేషన్ చేతుల్లో మాత్రమే లేదు. నిర్మాతల్ని సంప్రదించి, వాళ్ల అభిప్రాయాల్నీ సేకరించాల్సిన అవసరం ఉంది. అసలు కార్మికులు ఎంత డిమాండ్ చేస్తున్నారు? పెంచిన వేతనాలు చెల్లించడానికి నిర్మాతలు సముఖంగా ఉన్నారా, లేదా? అనేది చూసుకోవడం కూడా అత్యవసరం. ఈ విషయమే ఫెడరేషన్ పెద్దలతో నిర్మాతల సమావేశం కీలకం కానుంది. ఈ విషయంలో ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. లేదంటే ఎక్కడి షూటింగులు అక్కడే ఆగిపోతాయి. దాని వల్ల నిర్మాతలకే నష్టం.