చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థపై దూషణల కేసులో ఆయన పేరు కూడా ఉంది.ఇప్పటికే ఓ సారి సీబీఐ విశాఖకు పిలిపించి ప్రశ్నించింది. అయితే ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. సీఆర్పీసీ 41 (ఏ) సెక్షన్ కింద అధికారులు ఈ నోటీసులు ఇచ్చినట్లు చెప్తున్నారు. విజయవాడలోని సీబీఐ కార్యాలయంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
గతంలో హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినప్పుడు ర్యాలీ నిర్వహించి న్యాయమూర్తులపై దారుణమైన ఆరోపణలు చేశారు. ఆయన పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కనిపించాయి. ఇవన్నీ న్యాయవ్యవస్థను ఉద్దేశపూర్వకంగా కించ పరిచేలా ఉండటమే కాదు.. తప్పుడు ఆరోపణలు చేశారని హైకోర్టులో సీబీఐ విచారణకు ఆదేశింది. ఏపీ సీఐడీ పట్టించుకోకపోవడంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. కొంత కాలంగా విచారణ జరుపుతున్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గత ఏడాది నవంబర్ నెలలో కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకూ కొంత మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వారు బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఈ కేసులో ముందడుగు పడటం లేదు. ఇది వ్యవస్థీకృత నేరం అని సీబీఐ చెబుతోంది కానీ.. నిందితుల్ని మాత్రం పట్టుకోలేకపోతోంది. కేసులు నమోదైన తర్వాత కూడా దారుణమైన వ్యాఖ్యలు చేసిన పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి వైసీపీ నేతలతో కలిసి దావోస్‌లో పర్యటించినా ఏమీ చేయలేకపోయారు.ఆయనపై బ్లూకార్నర్ నోటీసులు కూడా ఉన్నాయి. అయితే హఠాత్తుగా ఆమంచికి నోటీసులు జారీ చేయడం.. ఒక్క రోజులోనే హాజరు కావాలని ఆదేశించడం.. హాట్ టాపిక్‌గా మారింది.