హమ్మ బీజేపీని కాదని ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉంటాయా ? అదీ మహారాష్ట్ర లాంటి కీలక రాష్ట్రాల్లో. కూటములు కట్టి పాలన చేస్తే దానంతటకు అది కూలిపోతుందేమోనని కొంత కాలం చూస్తారు. కొంత కాలం కూలగొట్టడానికి ప్రయత్నిస్తారు. ఇంకా లేకపోతే.. చివరికి విశ్వరూపం చూపిస్తారు. మహారాష్ట్రలో ఇప్పుడు అదే జరుగుతోంది. శివసేన చీలిక దిశగా వెళ్తోంది. ధాకరే కుటుంబసభ్యుల్నే ఎమ్మెల్యేలు ధిక్కరిస్తున్నారు. సీఎంగా ఉన్న ఉద్దవ్ ధాకరేను సాగనంపడానికి నిర్ణయించుకున్నారు. శివసేన ఎమ్మెల్యేల్లో అత్యధికులు ఏక్నాథ్ షిండే అనే నేత వెంట నడుస్తున్నారు. వారంతా బీజేపీ పాలిత రాష్ట్రాలకు క్యాంప్‌లకు వెళ్లిపోయారు.
2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. కానీ ముఖ్యమంత్రి పదవి తమకు ఇవ్వాలని శివసేన పట్టుబట్టింది.కానీ అత్యధిక ఎమ్మెల్యే సీట్లు ఉన్న బీజేపీ అంగీకరించలేదు. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్ధవ్ ధాకరే ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ సంకీర్ణం ఎక్కువ కాలం కొనసాగదనుకున్నారు. కానీ మూడేళ్లు నడిచింది. ఇప్పుడు బీజేపీ అసలు రాజకీయం ప్రారంభించింది. ఇటీవల జరిగిన రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫిరాయింపులకు ప్రోత్సాహం ఇచ్చిన బీజేపీ నేతలు.. వెంటనే తిరుగుబాటుకు చాన్సిచ్చారు. ఇప్పుడు కథ ప్రారంభమయింది.
ఆట ప్రారంభించిన తర్వాత ప్రభుత్వం మారే వరూక ఆపడం బీజేపీకి ఇష్టం ఉండదు. అందుకే ఇప్పుడు మహారాష్ట్రలో ఉద్దవ్ ధాకరే ప్రభుత్వం కుప్పకూలిపోతుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. మామూలుగా ధాకరే మాటను ఎవరూ ఎదురు చెప్పలేరు.కానీ ఇక్కడ అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఆయనను పట్టించుకోవడం లేదు. ఇక్కడ విషయం ఏమిటంటే కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎవరూ ఆయా పార్టీలను వదలడం లేదు. శివసేన ఎమ్మెల్యేలు మాత్రమే తిరుగుబాటు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అనుకోవచ్చు.