తెలుగుదేశం పార్టీ గుడివాడ నడి బొడ్డున మహానాడు నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మహానాడును నెలాఖరులో గుడివాడలో ఖరారు చేశారు. రెండు రోజుల పాటు చంద్రబాబు ఆ జిల్లాలోనే బస చేసి పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయబోతున్నారు. గుడివాడలోనే మహానాడు పెట్టాలని నిర్ణయించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కొడాలి నాని విషయంలో టీడీపీ క్యాడర్ అసహనంతో ఉన్నారు. చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులపై ఇష్టారీతిన తిట్లతో విరుచుకుపడే వంశీకి ఈ సారి బుద్ది చెప్పాలన్న లక్ష్యంతో ఎక్కువ మంది ఉన్నారు.
అయితే గుడివాడలో సరైన అభ్యర్థి లేకుండా పోయారు. రావి కుటుంబం నుంచి మార్చి కొడాలి నానికి చంద్రబాబు చాన్సు ఇచ్చిన తర్వాత టీడీపీ తరపున రెండు సార్లుఆయన గెలిచారు. కొడాలి దెబ్బకు రావి కుటుంబం రాజకీయంగా సైలెంట్ అయిపోయింది. కొడాలి పార్టీ మారిన తర్వాత రావి వెంకటేశ్వరరావు తెరపైకి వచ్చారు. ఆయన ఓ సారి నిలబడి ఓడిపోయారు. గత ఎన్నికల్లో దేవినేని అవినాష్‌కు టీడీపీ చాన్సిచ్చింది. అయితే ఆయన కూడా ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ రావి కుటుంబానికే చాన్సివ్వాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
గుడివాడలో ఉన్న పరిస్థితుల కారణంగా అక్కడే మహానాడు పెట్టి .. భయపడేది లేదని ప్రతీ దానికి బదులు చెల్లిస్తామని హెచ్చరికలు పంపితేనే క్యాడర్లో కదలిక వస్తుందని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే మహానాడును గుడివాడలో ఖరారు చేశారు. రెండు రోజుల పాటు చంద్రబాబు అక్కడే ఉండి… గుడివాడ అభ్యర్థిపై క్లారిటీ ఇవ్వడంతో పాటు వ్యూహాలను ఖరారు చేసే అవకాశం ఉంది. కొడాలిపై ఉన్న వ్యతిరేకత గుడివాడలో మహానాడులో కనిపించే అవకాశం ఉంది.