ప్రజాప్రతినిధులపై కేసులను ఇష్టారాజ్యంగా ఎత్తివేసే విషయంలోనూ ప్రభుత్వ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా పెద్ద ఎత్తున కేసులను ఉపసంహరించుకున్నారు. సీఎం జగన్ తో సహా సామినేని ఉదయభాను వంటి వారిపై ఉన్న హత్య లాంటి తీవ్రమైన కేసులను కూడా ఉపసహరించుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిపై హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. కొంతకాలంగా జరుగుతున్న విచారణలో తాజాగా హైకోర్టు ఇప్పటివరకు ఎన్ని కేసుల తొలగింపునకు హైకోర్టు అనుమతి తీసుకున్నారు, ఎన్ని ఉపసంహరించారన్నదానిపై అఫిడవిట్ వేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది
ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో సంబంధం లేకుండా డీజీపీ, కలెక్టర్ ఆదేశాలతో ఓటర్లకు డబ్బుల పంపిణీ, అధికారులపై దాడుల కేసులు కూడా.. తొలగించారని ఇలా చేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలా కేసులు తీసేసి ఉంటే.. కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్న ధర్మాసనం స్పష్టం చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంవ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు సొంత పార్టీ ప్రతినిధులపై అనేక కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
ఏ కారణాలు లేకుండానే నేరుగా డీజీపీ ఆదేశాలతో ఉపసంహరించుకున్నట్లుగా ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటిపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రజాప్రతినిధులపై కేసులే కాకుండా తుని అల్లర్ల కేసు అలాగే పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై దాడి కేసులను కూడా ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించుకోవడం వివాదాస్పదమయింది. ఈ ఆదేశాలుఇచ్చిన వారిపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.