అమ్మఒడి పథకం కోసం విద్యార్థుల తల్లులు ఎదురు చూస్తున్నారు. జనవరిలో ఖాతాల్లో పడాల్సిన సొమ్ము ఇంత వరకూ ఇవ్వలేదు. జూన్లో ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ ఇరవయ్యో తేదీ దాటిపోయింది. ఇరవై ఒకటోతేదీన అమ్మఒడి జమ చేస్తామన్నారు. కానీ ఆ తేదీ వచ్చినా ప్రభుత్వం కిక్కురుమనలేదు. ఇప్పుడు వచ్చే వారం ఇస్తామని చెబుతున్నారు. కానీ ఇస్తారో లేదో స్పష్టత లేదు. విద్యార్థుల అటెండెన్స్ సహా ఈ సారి అనేక నిబంధనలు పెట్టారు. ఈ కారణంగా లక్షల్లో లబ్దిదారులు తగ్గిపోయారన్న ప్రచారం జరుగుతోంది.
లబ్దిదారుల జాబితాలను ప్రదర్శించడానికి కూడా భయపడుతున్నారు. లబ్దిదారుల జాబితాలో పేరు ఉన్న డబ్బులు పడతాయో లేదో గ్యారంటీ లేని పరిస్థితి. ఇప్పటికే పథకం కోసం మందు బాబుల్ని తాకట్టు పెట్టి లిక్కర్ బాండ్లను వేలం వేసి రూ. ఎనిమిది వేల మూడువందల కోట్ల వరకూ అప్పు తీసుకు వచ్చారు. అలాగే ఆర్బీఐ వద్ద వారం వారం బాండ్లు వేలం వేసి అప్పు తెస్తున్నారు. ఈ కారణంగా పథకానికి నిధులకు లోటు లేదు. కానీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదనేది చర్చనీయాంశమవుతోంది.
ఇటీవల పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. సీఎం జగన్ మీట నొక్కారు. అయితే రైతులు తీవ్రంగా ఆందోళనలు ప్రారంభించారు. అసలైన రైతులకు కాకుండా వాలంటీర్లు భూమి లేని వైసీపీ నేతలకు.. వారి కుటుంబాలకు.. అనుచరులకు మాత్రమే పంట లెక్కలు రాశారని వాళ్లకే డబ్బులు అందాయని తేలింది. దీంతో రైతులు ఎక్కడికక్కడ మండి పడుతున్నారు. వాలంటీర్ల చేతిలో అధికారం ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అమ్మఒడి పథకం లబ్దిదారులు కూడా అదే విధంగా తిరుగుబాటు చేస్తే పరిస్థితి తీవ్రం అవుతుంది. ఇప్పటికే నియోజకవర్గానికి ఎడెనిమిది వేల మందిని తగ్గించినట్లుగా బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు చెప్పుకొచ్చారు.
ఈ సారి అమ్మఒడికి రూ. 2వేలు కత్తిరించి రూ. పదమూడు వేలే ఇస్తున్నారు. అది కూడా సక్రమంగా ఇస్తారా లేదా అన్నది ఎక్కువ మందిని టెన్షన్ పెడుతోంది. పన్నుల పేరుతో ఇప్పటికే అంత కన్నా ఎక్కువే కట్టామని వారి ఫీలింగ్.