“నేను తల్చుకోవాలే కానీ సీఎం అయిపోతా.. కానీ తల్చుకోను” అంటున్నారు గాలి జనార్దన్ రెడ్డి. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డబ్బుతో దేన్నైనా కొనగలరు. చివరికి బెయిల్ కూడా కొనగలరు. ఇప్పటికే డబ్బుతో చాలా చేసి చూపించారు. ఇప్పుడు ఆయనకు సీఎం పదవి మీద మనసు పడిందో లేకపోతే.. తాను ఎంత పవర్ ఫుల్లో చెప్పాలనుకుంటున్నారో కానీ తల్చుకుంటే సీఎం అవుతానని ప్రకటనలు చేస్తున్నారు. చాలాఏళ్ల తర్వాత ఆయనకు బళ్లారిలో ఉండటానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన బళ్లారిలోనే మకాం వేసి రాజకీయాలు చేస్తున్నారు.
ఆయన వెనుక ఉన్న కేసుల లగేజీ కారణంగా బీజేపీ కూడా నేరుగా తమ పార్టీ అని చెప్పుకోవడం లేదు. కానీ ఆయన అనుంగు అనుచరుడు శ్రీరాములుతో పాటు సోదరులు అందరూ బీజేపీలో ఉన్నారు. బీజేపీకి కావాల్సిన సాయం చేస్తున్నారు. కానీ గాలి జనార్ధన రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపే దైర్యం మాత్రం బీజేపీ చేయడం లేదు. అయినప్పటికీ ఆయన తాను తల్చుకుంటే సీఎం అవగలనని చాలెంజ్ చేస్తున్నారు. ఇది కేవలం తాను బలవంతుడినని చెప్పుకోవడానికా.. నిజంగా ఆశలు పెట్టుకుంటున్నారా అన్నది కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
ధనన్ని అడ్డగోలుగా సంపాదించడమే కాదు.. ఆ సంపదను.. అందరి ముందు ప్రదర్శించుకోవడం… ఆ ధనం పెట్టే అందరూ చర్చించుకునేలా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఆయన స్టైల్. ఆయన కుమార్తె పెళ్లి చేసినా.. కుమారుడ్ని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నా ఆయన రేంజ్ కనిపిస్తుంది. ఇప్పుడు సీఎం పదవి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి.. ముందు ముందు కర్ణాటక రాజకీయాల్లో గాలి దుమారం ఖాయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీలో ఇప్పుడు సరైన సీఎం అభ్యర్థి లేరు.