తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగా విరుచుకుపడుతున్నారు. దమ్ముంటే తనపై కేసులు పెట్టాలని సవాల్ కూడా చేస్తున్నారు. ప్రతీ విషయంలోనూ తెలంగాణకు అన్యాయమే జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అయితే అదే సమయంలో ఆయన తరచూ ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఇటీవల రాజీవ్ చంద్రశేఖర్‌తో భేటీకిప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి వచ్చిన ఆయన ఆ తర్వాత పలు జిల్లాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు.
అసలు కేంద్రం నిధులేమీ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ నిధుల కోసం ఢిల్లీ వెళ్తున్నారు. హఠాత్తుగా ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరీతో సమావేశమయ్యారు. హైదరాబాద్ మురుగునీటి పారుదల ప్లాన్, రోడ్లకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. అయితే ఎన్ని సార్లు అడిగినా అసలేమీ ఇవ్వడం లేదని చెబుతున్నప్పుడు మళ్లీ ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి అడగడం ఎందుకన్నది పజిల్‌గా మారింది.
పైగా ఇప్పుడు ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తే.. కనీసం మొహం చూపించడానికి కూడా సీఎం కేసీఆర్ ఆసక్తి చూపించడం లేదు. బీజేపీపై పోరాటానికి ప్రత్యేక రాజకీయ పార్టీ పెడుతున్నానని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ వరుసగా కేంద్రమంత్రుల్ని కలుస్తూండటం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగానే కనిపిస్తోంది.