వైఎస్ఆర్సీపీ మరో మాట మాట్లాడలేదు. కనీసం రాష్ట్రానికి ఫలానా సాయం చేయండి అని కోరను కూడా కోరలేదు. గిరిజన అభ్యర్థిని నిలబెట్టారన్న కారణం చెప్పి మద్దతు ప్రకటించేశారు. అసలు బీజేపీ నేతలు ఒక్క సారి కూడా బహిరంగంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతివ్వమని బహిరంగంగా వైసీపీని కోరనే లేదు. జగన్ వద్దకు వచ్చి ఒక్క కేంద్రమంత్రి కూడా సహకారం కోరలేదు. అయిన జగన్మోహన్ రెడ్డి మాత్రం మద్దతు ప్రకటించేశారు. నామినేషన్లో పాల్గొనేందుకు వెళ్తామని చెప్పారు కానీ… చివరి క్షణంలో కేబినెట్ భేటీ ఉందని రద్దు చేసుకున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ కీలకం అని మొదటి నుంచి వైసీపీ నేతలే ప్రచారం చేశారు. చివరికి ఆ కీలకాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ మాత్రం ఉపయోగించుకోకుండా పక్కన పెట్టేశారు. భేషరతు మద్దతు బీజేపీకి ఇచ్చేశారు. మన అవసరం వచ్చినప్పుడు ప్రత్యేకహోదా అడుగుతామన్న జగన్ ప్రకటనలన్నీ తుస్సుమన్నాయి. దీనిపై విపక్షాలు విమర్శలు చేసినా… ప్రజలు ప్రశ్నిస్తున్నా ఏమీ ఎరుగనట్లుగా సైలెంట్‌గా ఉండిపోయారు కానీ కనీసం స్పందించలేదు. చివరికి ముర్ముకే మద్దతిస్తున్నట్లుగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ప్రజలు ఇచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేల బలాన్ని రాష్ట్రప్రయోజనాల సాధన కోసం ఏ మాత్రం వినియోగించుకోకుండా ఇలా కేంద్రానికి ఏకపక్షంగా లొంగిపోవడం.. కనీసం హోదా లేకపోయినా పోలవరం నిధులు అయినా సాధిస్తారనుకుంటే అదీ లేకపోవడం చాలా మందిని నిరాశపరుస్తోంది.గతంలో తెలుగుదేశం పార్టీ అటు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా… బయటకు వచ్చినా..తన పోరాటం మాత్రం ఆపలేదు. డిమాండ్స్ కొనసాగిస్తూనే ఉంది. కానీ వైసీపీ మాత్రం భారీగా బలమున్నా కనీసం నోరెత్తడానికి భయపడుతోంది.