చిత్తూరు జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబంగా ఉన్న గల్లా ఫ్యామిలీ ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అమరరాజా కంపెనీలపై ఏపీ ప్రభుత్వం విరుచుకుపడిన తర్వాత గల్లా జయదేవ్ సైలెంట్ అయ్యారు. ఆయన అప్పుడప్పుడూ కనిపిస్తున్నారు. కానీ టీడీపీ కార్యక్రమాల్లో.. రాజధాని వ్యవహారాల్లో గతంలోలా యాక్టివ్‌గా లేరు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ స్థానానికి ఆయన పోటీ చేయడం లేదన్న ప్రచారం కూడా అప్పుడే ప్రారంభమయింది. ఆయన స్వచ్చందంగా తప్పుకుంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
మరోవైపు గల్లా అరుణ కుమారి కూడా ఇక తాను రాజకీయాల్లో ఉండనని ప్రకటించేశారు. 2014లో చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత లా నెమ్మదిగా రాజకీయాలకు దూరం ఉంటూ వచ్చారు.. 2019 ఎన్నికలకు ముందుగానే తాను నియోజకవర్గం భాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. టీడీపీ పొలిట్ బ్యూరోలో చాన్సిచ్చినా తర్వాత వైదొలిగారు. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తాను రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు.. తన రాజకీయ ప్రయాణం ముగిసిందని, సేవా ప్రయాణం మొదలు పెట్టానని ప్రకటించారు. తన అనుచరులు ఏ పార్టీలో భవిష్యత్ ఉంటే ఆ పార్టీలో చేరిపోవచ్చని సలహా ఇచ్చారు.
గల్లా జయదేవ్ ఎమ్మెల్యేగా చంద్రగిరి నుంచి పోటీ చేస్తారేమో తెలియదు కానీ.. ఇప్పటికైతే గల్లా ఫ్యామిలీ సైలెంట్‌గా ఉంది. నిజానికి గల్లా జయదేవ్ సోదరి అమెరికా నుంచి తిరిగి వచ్చేసి తిరుపతిలో భారీ ఆస్పత్రి ప్రారంభించారు. ఆమె చంద్రగిరి నుంచి లేదా మరో స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అయితే రాజకీయం అమరరాజా వ్యాపార సామ్రాజ్యం మీద గురి పెట్టడంతో ఆ ఫ్యామిలీ వెనక్కి తగ్గుతున్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.