తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి టీఆర్ఎస్లో ఎవరు అసంతృప్తిగా ఉన్నారో గుర్తించి వారిని ఠక్కున పిలిచి కండువాలు కప్పడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల్లోనే టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన వైరా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రెండు రోజుల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇంకా కొంత మందిపేర్లు వినిపిస్తున్నాయి. ఓవర్ లోడ్ అయిన టీఆర్ఎస్కు ఇతర పార్టీల్లో అవకాశాలు కనిపిస్తున్న ఇతరుల్ని బుజ్జగించిపార్టీలో ఉంచడం కష్టమే.
ఇలాంటి పరిస్థితుల్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నేతలు చేరికల విషయంలో వ్యూహాత్మకంగా లేరు. ఒకరు చేరికలకు చర్చలు జరిపితే.. ఇంకొకరు వెనక్కి లాగుతున్నారు. వర్గాలుగా మారిపోయారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు బీజేపీలో చేరాలనుకున్నారు. కానీ ఆయనకు అక్కడ పరిస్థితి అర్థమయ్యే సరికి రేవంత్ రెడ్డి టచ్‌లోకి వెళ్లారు. అనుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు. టీఆర్ఎస్కు ప్రస్తుతం మరీ అంత పాజిటివ్ వేవ్ లేదు. అలాగని ఇతర పార్టీలకు ఏకపక్షంగా లేదు.
కానీ ఇలాంటి చేరికల ద్వారానే పాజిటివ్ వేవ్ వస్తుంది. రేవంత్ రెడ్డి దాన్ని వ్యూహాత్మకంగా తీసుకు వస్తున్నారు . టీఆర్ఎస్ నేతలు వరుసగా కారు దిగిపోతున్నారంటే.. అది ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్ పంపుతుంది. ఈ విషయంలో రేవంత్ పైచేయి సాధిస్తున్నారు. ప్రచారంలో ఉన్న వారిలో సగంమందికి కాంగ్రెస్ కండువా కప్పినా పార్టీకి ఊపు వచ్చేస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.