ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పొత్తులపై చివరికి ఓ క్లారిటీకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. విశాఖలో నిర్వహించిన కోర్ కమిటీ భేటీలోఈ అంశంపై సింగిల్ లైన్ తీర్మానం ఆమోదించారు. తమకు ఎవరితో పొత్తు కావాలి.. ఎవరితో వద్దు అనే అంశాలపై ఎలాంటి చర్చ లేకుండా పొత్తులపై కేంద్ర కమిటీ నిర్ణయమే ఫైనల్ అని తేల్చారు.ఇక పార్టీ బలోపేతం అంశంపై చాలా రకాలుగా చర్చించినప్పటికీ.. పొత్తులపై వారు తీసుకున్న నిర్ణయమే చర్చనీయాంశమవుతోంది. ఇప్పటి వరకూ ఏపీ బీజేపీ నేతలు అందరూ పార్టీ నిర్ణయం అంటే.. తమ నిర్ణయం అన్నట్లుగా చెలరేగిపోయేవారు. సోము వీర్రాజు.. జనసేనతోనే పొత్తు.. టీడీపీతో ఉండదుఅని చెబుతారు. విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వారు బాబొస్తే సీట్లిస్తామని పెద్ద పెద్ద మాటలు చెబుతూంటారు.
ఇతరులు పొత్తులపై మీరెవరు మాట్లాడటానికి అని సెటైర్లు వేస్తూంటారు. ఈ పరిస్థితుల్లో అంతా గందరగోళమే అయింది. చివరికి పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయేమో కానీ.. పొత్తులపై మాట్లాడకపోవడమే మంచిదని డిసైడయ్యారు. కేంద్ర పార్టీ నిర్ణయం మేరకే పొత్తులు ఉంటాయని వారి అభిప్రాయం ప్రకారం ముందుకు నడవడమేనని తేల్చేశారు. ఏపీ బీజేపీకి ఉన్న సమస్య ఏమిటంటే.. ఆ పార్టీలో మూడు వర్గాలుంటాయి. ఓ వర్గం వైసీపీతో సన్నిహితంగా ఉంటుంది. పొత్తుల్లేకపోయినా.. ఆ పార్టీని సమర్థిస్తూ ఉంటారు. మరో వర్గం టీడీపీతో జత కడితే ఎన్నోకొన్ని సీట్లు వస్తాయని వాదిస్తూ ఉంటారు.
మరో వర్గం పక్కా బీజేపీ.. వారు సొంతంగా బలపడదామని చెబుతూ ఉంటారు. కానీ అలాంటి వారు తక్కువ. ఈ కారణంగా బీజేపీ మూడు వర్గాలుగా విడిపోయి… ఎటూ కాకుండా పోతోంది. హైకమాండ్ కూడా తమ జాతీయ రాజకీయాల కోసం ఏపీ బీజేపీని అలా వాడుకుంటూనే ఉండటంతో సమస్య వచ్చి పడుతోంది. చివరికి ఏపీ నేతలకు పొత్తులు తమ చేతుల్లో లేవన్న ఓ క్లారిటీకి మాత్రం వచ్చినట్లయింది.