ఏపీ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది. ఈ నెలలో ఎప్పుడో ప్రొబేషన్ ఖరారు చేసి జూలై మొదటికి గవర్నమెంట్ స్కేల్ జీతం అందుకుంటారని ఆశగా ఎదురు చూస్తూంటే.. ఇరవై ఐదో తేదీ వచ్చిన తరవాత ఫైల్ మీద జగన్ సంతకం పెట్టారంటూ కొత్త వార్తలు బయటకు వచ్చాయి. నిజానికి ఇప్పటికే జీతాల బిల్లులు రెడీ అయిపోయి ఉంటారు. ఆ ప్రకారం చూస్తే.. ఈ నెల కూడ సచివాలయ ఉద్యోగులు పాత జీతాలకే పని చేయాలి.
ఇక్కడ అసలు ట్విస్టేమిటంటే.. రాష్ట్ర స్థాయిలో పరీక్షలు పెట్టి తీసుకున్న సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను కరెక్టర్లు ఫైనల్ చేస్తారట. సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎలాంటి రిమార్కులు లేని.. సెలవులు వాడుకోని… రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకుని ఇంకా చెప్పాలంటే పూర్తి స్థాయిలో ఎలిజిబిలిటి టెస్ట్ పూర్తయిన వారికి మాత్రమే ప్రస్తుతం పర్మినెంట్ చేస్తున్నారు. ఇతరులెవరికీ ఇవ్వడం లేదు. వీరి సంఖ్య చాలా పరిమితంగా ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. ఎంత మందిని తీసుకున్నారు.. మూడేళ్ల గడువు దగ్గర పడుతున్న సమయంలో.. వారిలో ఎంతం మందిని గవర్నమెంట్ సర్వీస్‌లోకి మారుస్తున్నారో ప్రబుత్వం చెప్పడం లేదు.
పరీక్ష పూర్తి చేసిన వారికి ఖాయం అని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే సంతోషపడేవాళ్లేమో కానీ.. అలాంటి ఆలోన పెట్టుకోవడం లేదు. అసలు కలెక్టర్లు ఎంత మంది అసలైన నివేదికలు ఇస్తున్నారన్నదానిపై స్పష్టత లేదు. దీంతో ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ.. తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు,