కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం రంగమార్తాండ. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మరాఠీలోని `నటసామ్రాట్` మాతృక. చాలాకాంగా ఈ సినిమా సెట్స్‌పైనే ఉంది. చివర్లో బడ్జెట్ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఓ పది శాతం షూటింగ్ ఉందనగా, డబ్బులు లేకపోవడంతో సినిమా ఆగిపోయింది. నిర్మాత కూడా డబ్బులు సర్దలేక చేతులు ఎత్తేశాడు. కాకపోతే… ఓటీటీ నుంచి మంచి ఆఫర్ కావడం, ఈ సినిమాపై బయట పాజిటీవ్ బజ్ నడవడంతో `రంగమార్తాండ` ఎప్పుడు బయటకు వస్తుందా… అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు `రంగమార్తాండ`కు మోక్షం లభించింది. నిర్మాతకు డబ్బులు సర్దుబాటు అవ్వడంతో.. మిగిలిన షూటింగ్‌ని పూర్తి చేయడానికి సమాయాత్తం అయ్యారు. మరో పది రోజుల్లో రంగమార్తండ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆగస్టు లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చినా, ఈ సినిమాని నేరుగా థియేటర్లలోనే విడుదల చేయాలన్నది కృష్ణవంశీ ఆలోచన. చివర్లో నిర్ణయం మారితే తప్ప.. ఈ సినిమా థియేటర్లో విడుదల చేయడం తథ్యం. చాలా కాలంగా కృష్ణవంశీ తనదైన మార్క్ సినిమాని అందివ్వడంలో విఫలం అవుతూనే ఉన్నారు. మరి ఈసారైనా ఆయన అభిమానుల్ని అలరిస్తారో, లేదో చూడాలి.