ఆంధ్రప్రదేశ్లో రెండు రోజులుగా ముస్లిం ప్రజల కోసం ప్రభుత్వం ఏ పధకమూ చేపట్టలేదని.. గతంలో అమల్లో ఉన్న పథకాలు నిలిపివేశారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీతో పాటు ఇస్లామిక్ బ్యాంక్ సహా పాదయాత్రలో అనేక వరాలు ఇచ్చారు. ఏ ఒక్క పథకం అమలు చేయకపోగా.. ఉన్న పథకాలను నిలిపివేశారు. టీడీపీ హయాంలో దుల్హన్ అనే పథకంలో పేద ముస్లిం కుటుంబాల్లో వివాహం జరిగితే ప్రభుత్వం రూ. యాభైవేలు ఇచ్చేది. తాము వస్తే రూ. లక్ష ఇస్తామన్న జగన్.. గత మూడేళ్ల నుంచి మాట్లాడటం లేదు. ఇప్పుడు డబ్బుల్లేవని కోర్టుకు చెప్పారు.
ఆ ఒక్క పథకమే కాదు.. ముస్లిం విద్యార్థులు పలువురు విదేశీ విద్యాదీవెన పథకం కింద విదేశాలకు వెళ్లి చదువుకున్నా డబ్బులు ఇవ్వడం లేదు. ఇలాంటి వారి చదువు ఎక్కడికక్కడ ఆగిపోయింది. వీరిలో ముస్లింలు కూడా అధికసంఖ్యలో ఉన్నారు. అలాగే మైనార్టీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. గత మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదు. ఎవరికీ ఉపాధి కల్పించలేదు.. వారి జీవితాల్ని మార్చే ప్రయత్నం చేయలేదు. అందరికీ ఇచ్చే అమ్మఒడి.. ఇతర పథకాలను కార్పొరేషన్ ఖాతాలో రాస్తూ వస్తున్నారు.
ప్రభుత్వం ముస్లింలను ఇలా ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందన్న వాదనపై వైసీపీలోనే భిన్న చర్చలు నడుస్తున్నాయి. బీజేపీ ఇలాంటి విషయాల్లో సున్నితంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఆ పార్టీకి కోపం తెప్పించడం ఇష్టం లేక ముస్లిం పథకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్న అభిప్రాయంతో ఎక్కువ మంది ఉన్నారు. ఇటీవల మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ముస్లిం యువతకు డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపణలు చేయగానే… డ్రోన్ కార్పొరేషన్ అదంతా ఉత్తదేనని ప్రకటన చేసింది. అంటే ట్రైనింగ్ కూడా నిలిపివేసినట్లయింది. ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకున్న రాజకీయవర్గాలు… బీజేపీ ఎఫెక్ట్ కారణంగానే జగన్ ముస్లిం పథకాలపై శీతకన్నేశారని నమ్మడానికి కారణం అవుతోంది.