తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని విలీనం చేస్తామని వైసీపీ ప్రకటించింది. జగన్ సీఎం అయిన తర్వాత సాంకేతిక సమస్యలు ఉన్నాయని కేవలం ఉద్యోగుల్ని మాత్రమే ప్రజా రవాణా శాఖ అనే విభాగాన్ని ఏర్పాటు చేసి విలీనం చేసింది. ఆర్టీసీ మాత్రం అలాగే కొనసాగుతోంది. తాజాగా ఆర్టీసీ మొత్తాన్ని తాము లీజుకు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఎన్ని సమస్యలు ఉన్నాయో చెప్పడం లేదు కానీ.. ఖచ్చితంగా లీజు ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటోంది. అది కూడా కొన్ని రకాల పన్నులను కేంద్రానికి కట్టకుండా తప్పించుకోవడానికే.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది. వారికి ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోంది. కానీ వారు పని చేస్తోంది మాత్రం వేరే సంస్థగా ఉన్న ఏపీఎస్ఆర్టీసీకి. ఆర్టీసీ వారి సేవల్ని వినియోగించుకుంటోందన్నమాట. అందుకు గానూ జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. ఈ జీఎస్టీని చెల్లించకుండా ఎలా తప్పించుకోవాలా అని పరిశోధన చేసిన ప్రభుత్వం.. ఆర్టీసీని లీజుకు తీసుకోవడం ఓ పరిష్కారం అని కనుగొంది. ఈ మేరకు ఉత్తర్వులు రెడీ చేస్తున్నారు. లీజుకు ఎందుకు నేరుగా ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ప్రభుత్వంలో విలీనం చేసుకోవచ్చు కదా సందేహం ఎక్కువ మందికి వస్తోంది.
అయితే ఆర్టీసీని విలీనం చేసుకుంటే.. ఆసంస్థకు ఉండే అప్పుల భారం అంతా ప్రభుత్వానికి బదిలీ అవుతుంది. ప్రభుత్వం కట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. కేంద్రం అంగీకరించాలి. అందుకే లీజుకు తీసుకోవాలని నిర్ణయించారు. కొసమెరుపేమిటంటే ఆర్టీసీలో అసలు సొంత బస్సుల కన్నా అద్దె బస్సుల సంఖ్యే ఇటీవల ఎక్కువగా పెరిగిపోతోంది. ఇప్పుడు ఆర్టీసీనే లీజుకు వెళ్తోందన్నమాట. ఒక పని చేయడానికి మరో పని పెట్టుకోవడం అంటే… ఏపీ ప్రభుత్వాన్నే చూసి నేర్చుకోవాలన్న విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి.