‘మా సినిమా కొత్తగా ఉంటుంది.. ఇది వరకెప్పుడూ ఇలాంటి పాయింట్ రాలేదు..’ అని సినిమా విడుదలకు ముందు దర్శక నిర్మాతలు డబ్బా కొట్టుకోవడం మామూలే. అయితే మారుతి మాత్రం… తన సినిమాకి రివర్స్ స్ట్రాటజీని వాడుతున్నాడు. ‘మా సినిమా రొటీన్ గానే ఉంటుంది. కానీ బాగుంటుంది’ అంటూ కొత్త పాట అందుకొన్నాడు.
తన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. గోపీచంద్ కథానాయకుడు. జులై 1న వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లు విరివిగా జరుగుతున్నాయి. అందులో భాగంగా.. మారుతి ఈ వెరైటీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ‘తమది రొటీన్ కథే అని.. ఇది వరకు చాలా కమర్షియల్ సినిమాల్లో చూసిన సీన్లే.. ఆ ఫార్ములాలోనే సినిమా ఉంటుంద’ని కుండ బద్దలు కొట్టేశాడు. ”కొన్ని సినిమాలు చూస్తే.. `ఇది పక్కా కమర్షియల్ సినిమా రా` అంటారు. ఆ మాట మాకు మేం ముందే అనేనుకొనే టైటిల్ పెట్టాం. ఈ సినిమాలో అన్నీ కమర్షియల్ హంగులే ఉంటాయి. కమర్షియల్ సినిమాల్లో లాజిక్ ఉండదు. మా సినిమాల్లోనూ దాన్ని వెతక్కండి… పాటల కోసం పాటలు.. ఫైట్ల కోసం ఫైట్లు.. కమర్షియల్ సినిమాల ఫార్ములా. దానికి తగ్గట్టుగానే… ఈ సినిమా తీశాం” అని చెబుతున్నాడు మారుతి. ఆయనే అలా అంటే.. చూసినోళ్లు ఇంకేం అనడానికి లేదుగా. అందుకే ముందే హింట్ ఇచ్చేసి, ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేస్తున్నాడన్నమాట.