తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి రాజకీయవర్గాలను క్లీన్ బౌల్డ్ చేశారు. తనకు కోపం వస్తే వారి మొహం చూడటానికి కూడా ఇష్టపడని కేసీఆర్.. గవర్నర్ తమిళిసైకి మాత్రం ఊహించని షాక్ ఇచ్చారు. చీఫ్ జస్టిస్‌గా ఉజ్జయ్ భుయాన్ ప్రమాణస్వీకారానికి హాజరవుతారా లేదా అన్న సందేహం అలా ఉండగానే ఆయన సమయానికి రాజ్ భవన్‌కు వచ్చారు. అంతేనా.. గవర్నర్‌తో అసలు విభేదాలేమీ లేనట్లుగానే వ్యవహరించారు. కలివిడిగా మాట్లాడారు. గవర్నర్ ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చిన తేనీటి విందులోనూ పాల్గొన్నారు. బీజేపీ నేత కిషన్ రెడ్డితో కలిసి గవర్నర్‌తో ముచ్చట్లు పెట్టారు. జోకులు కూడా వేసుకున్నారని నవ్వుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ నేతలు కూడా అవాక్కయ్యారు.
ఇప్పటి వరకూ గవర్నర్‌పై అంత తీవ్రంగా పోరాడి.. ఇప్పుడు అసలేమీ జరగనట్లుగా కేసీఆర్ వ్యవహరించడమే వారు అవాక్కవడానికి కారణం. గవర్నర్‌ను కేసీఆర్ అసలు గుర్తించలేదు. అసెంబ్లీలో ప్రసంగానికి అంగీకరించలేదు. ప్రోటోకాల్ కూడా గవర్నర్‌కు ఇవ్వడం లేదు. ఈ కారణంగానే ఆమె కేసీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ పరంగా అధికారికంగా గవర్నర్‌పై అనేక ఆరోపణలు చేస్తూ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ఇప్పుడా విభేదాలన్నీ పక్కకుపోయినట్లేనని భావిస్తున్నారు.
కేసీఆర్ రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమని రాజకీయవర్గాలు చెబుతూంటాయి. గవర్నర్ తమిళిశై విషయంలో ఆయన మరోసారి అలాంటి రాజకీయమే చేశారు. అయితే.. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో కనిపించిన సుహృద్భావ బేటీ ఇక ముందు కూడా కొనసాగుతుందా లేదా అన్నది మాత్రం … కేసీఆరే తన చేతల ద్వారా చూపించాల్సి ఉంటుంది. అప్పటి వరకూ ఆయన వ్యూహాలెవరూ అంచనా వేయలేరు.