వైసీపీలో కీలక నేతలు తమపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని అనుమానంతో బతికేస్తున్నారు. రోజుకొకరు చొప్పున మీడియా ముందుకు వస్తున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ తరహా ఆరోపణలు చేసి గంటలు గడవక ముందే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అవే ఆరోపణలు చేశారు. తనపై పెద్ద నేతే కుట్ర చేస్తున్నాడని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కోటంరెడ్డి.. పెద్ద నేత అని పేరు చెప్పలేదు కానీ..ఆ రేంజ్‌లోనే తన పార్టీ వాళ్లే తనను బ్యాడ్ చేస్తున్నారని అంటున్నారు.
తన ఇమేజ్ డ్యామేజీ చేయాలని, తనని బలహీన పరచాలని కొంతమంది కుట్రలు చేస్తున్నారని, అలాంటి వారిని నిలువరించాలని తాను ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేశానని చెప్పారు. అలాంటి వారు ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీలో ఉంటారో వారికే తెలియదని, వారంతా సీజనల్ పొలిటీషియన్లేనని అన్నారు. అలాంటి సీజనల్ పొలిటీషియన్లకు తన నియోజకవర్గంతో ఏం పని అంటూ నిలదీశారు. వారి పేర్లు మాత్రం తాను ఇప్పుడు బయటపెట్టనని, ఇప్పటికే అధిష్టానానికి చెప్పానని, సమయం వచ్చినప్పుడు పేర్లు బయటపెడతానన్నారు. తనకు రెండు ఆప్షన్లే ఉన్నాయని.. మొదటిది హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడం.. రెండోది తాను వారి నియోజకవర్గాల్లో వేలు పెట్టడమని చెబుతున్నారు.
అయితే కోటంరెడ్డి ఇటీవల పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే తాను పార్టీ మారతానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటున్నారు. సీజనల్ పొలిటీషియన్లలాగా తాను పార్టీలు మారనని చెప్పుకొచ్చారు. అయితే కోటంరెడ్డి బీజేపీ నుంచి వైసీపీకి వచ్చారు.