జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి రాక ముందే ప్రజా సమస్యల పరిష్కారం కోసం నడుం బిగించారు. బాదితులను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోతూండటమే కాదు.. అసలు అర్జీలు కూడా తీసుకోవడం లేదని ఇటీవల పరిణామాలు తేట తెల్లం కావడంతో జనవాణి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. జనవాణి అంటే ప్రతి అదివారం.. పవన్ కల్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండి.. వారి సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటి పరిష్కారానికి పార్టీ తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారు. అంటే ఓ రకంగా ప్రభుత్వాలు నిర్వహించే ప్రజాదర్బార్ లాంటివన్నమాట. నిజానికి స్పందన పేరుతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
కానీ ఆ దరఖాస్తులు ఎక్కడివక్కడే ఉంటున్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. గతంలో ప్రజాదర్బార్ పెడతానన్న సీఎం జగన్ తర్వాత మర్చిపోయారు. ఎప్పుడైనా ఏదైనా పథకం మీట నొక్కడానికి ఆయన ఇతర ప్రాంతానికి వెళ్లినప్పుడు ఎవరైనా ఆర్జీలు ఇవ్వబోతూంటే పట్టించుకోవడం లేదు. ఇటీవల ప్రకాశం జిల్లాలో వికలాంగ దళిత మహిళ ఆర్జీ ఇవ్వడానికి వస్తూంటే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి బాధితుల కోసం అండగా ఉండేందుకు పవన్ కల్యాణ్ జనవాణి చేపట్టాలని నిర్ణయించారు.
వచ్చే మూడో తేదీ నుంచి అంటే వచ్చే ఆదివారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలి రెండు ఆదివారాలు.. విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో నిర్వహిస్తారు. తర్వాత జిల్లాల్లోనూ పర్యటించి ఆర్జీలు తీసుకుంటారు. పవన్ కు విన్నవించుకుంటే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని.. అందుకే ఆర్జీలు తీసుకుంటామని.. రసీదు ఇస్తామని.. ఆ సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు జనసేన ఫాలో అప్ చేస్తుందని ఆ పార్టీ ప్రకటించింది.