వైసీపీలో కుట్ర రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే మీడియా ముందు చెప్పుకుని భోరుమంటున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లా నేతలు ఇలా బహిరంగంగా చెప్పుకున్నారు. ఇంకా పలువురు నేతలు లోలోపల రగిలిపోతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి మాత్రమే కాదు ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువు కూడా. అలాంటి నేత తనపై వైఎస్ఆర్సీపీలోని పెద్ద నేతలే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. వరుసగా రెండు రోజులు ప్రెస్ మీట్ పెట్టి అదే చెప్పారు.
అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సరిపడదు. గతంలో ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకునేవారు. ఇప్పుడు కాకాణి మంత్రి కావడంతో కోటంరెడ్డికి సెగ ప్రారంభమయింది. దీంతో ఆయన ఏబీఎన్ లాంటి చానళ్లతో కూడా మాట్లాడి తన బాధ చెప్పుకుంటున్నారు. ఈ రెండు చోట్లే కాదు ప్రతి జిల్లాలో దాదాపుగా సగం నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉందంటున్నారు.
పార్టీలో ముఖ్య నేతల వద్ద ప్రాపకం సంపాదించి ప్రత్యేకంగా వర్గం ఏర్పాటు చేసుకుని పోటీగా ఉన్న వారిపై పైచేయి సాధించడానికి వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్లే పార్టీ నేతలకు చెందిన అనేక రకాల వివాదాస్పద వ్యవహారాలు మీడియాలో హైలెట్ అవుతున్నాయన్న అనుమానాలు కూడా ఉన్నాయి. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఇప్పుడు జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తల బాధ్యతలను విజయసాయిరెడ్డికి ఇచ్చారు. దీంతో నేతలు వర్గాలుగా విడిపోయి కొంత మంది సజ్జల వద్దకు.. మరికొంత మంది విజయసాయి వద్దకు వెళ్తూండటంతో పరిస్థితి మరితం జఠిలం అవుతోందనే భావవ వినిపిస్తోంది.