ఆంధ్రాపోరి, మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్… పూరి ఆకాష్ ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఇవీ. నాలుగూ ఫ్లాపులే. ఓ హీరోకి తను చేసిన తొలి నాలుగు సినిమాలు ఫ్లాప్ అవ్వడం.. అసలు ఆ హీరో కెరీర్‌కే మంచిది కాదు. అలాగని ఆకాష్లో టాలెంట్ లేదా? అంటే అదీ కాదు. తను ప్రతిభావంతుడే. నటన, డైలాగ్ డెలివరీ అన్నీ బాగుంటాయి. కానీ… తన వయసుకి తగిన కథల్ని ఎంచుకోవడం లేదంతే!
`ఎంతోమందిని సూపర్ స్టార్లని చేశావు.. నీ కొడుకుని మాత్రం గాలికొదిలేశావ్` అని బండ్ల గణేష్ మొన్నామధ్య కొన్ని వ్యాఖ్యలు చేశాడు. నిజానికి పూరి.. తన కొడుకుని గాలికి వదిలేయ్ లేదు. `రొమాంటిక్` సినిమాపై గట్టిగానే దృష్టి పెట్టాడు. బాగా ఖర్చు పెట్టి సినిమా తీశాడు. ప్రచారం కూడా బాగానే చేశాడు. కానీ కలసి రాలేదు. అందుకే మరోసారి ఆకాష్ పూరి కోసం ఓ సినిమా తీయాలనుకుంటున్నాడట పూరి. తన దగ్గర కథలకు లోటు లేదు. అందులోంచి ఓ మంచి కథని.. ఆకాష్ కి ఇద్దామనుకుంటున్నాడట. తన దర్శకత్వ పర్యవేక్షణలోనే, తన నిర్మాణంలోనే ఓ సినిమా చేయాలని పూరి జగన్నాథ్ ఫిక్సయ్యాడట. ఈసారి.. కూడా ఆకాష్‌కి హిట్టు రాకపోతే… పూరి కూడా ఏం చేయలేడని అర్థం. పూరి తండ్రిగా తన వంతు బాధ్యత నిర్వర్తించడానికి చేస్తున్న ఆఖరి ప్రయత్నం ఈ సినిమా అనుకోవచ్చు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.